JAISW News Telugu

Singer Chinmayi : శ్రుతిమించిన చిన్మయి మాటలు.. క్షమాపణ చెప్పాలంటున్న నెటిజన్లు

Singer Chinmayi

Singer Chinmayi

Singer Chinmayi : సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. మహిళా సామాజిక అంశాలపై, దేశ సంబంధిత అంశాలపై తరుచుగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఒక్కోసారి ఆమె వ్యాఖ్యలు వివాదాలకు తావిస్తుంటాయి. ఆమె ఓవర్ యాక్షన్ తో నెటిజన్లతో చివాట్లు కూడా తింటుంది. ఈ సారి సీనియర్ నటి అన్నపూర్ణమ్మకు కౌంటర్ ఇచ్చే అతిగా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు స్త్రీల వేషధారణ వ్యవహార సరళి కూడా కారణం అవుతున్నదన్న అభిప్రాయాల గురించి చిన్మయి ఫైర్ కావడంలో విశేషం ఏమీ లేదు కానీ.. అలా ఫైర్ కావడాన్ని ఇంకాస్త స్పైసీగా మార్చడానికేనా అన్నట్టుగా.. భారత దేశంలో అమ్మాయిగా పుట్టడమే ఖర్మ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదమవుతున్నాయి. ఆమె తరచుగా ఇలా దూకుడు వ్యాఖ్యానిస్తూ వివాదాల్లో చిక్కుకుంటోంది. అయినా ఆమె వెనకాడే రకమేమి కాదు. ఈ సందర్భంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మీద విరుచుకుపడడం గమనార్హం.

ప్రస్తుతం బామ్మ పాత్రలు వేస్తున్న అన్నపూర్ణమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడారు. ‘‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్లు రాత్రిళ్లు బయటకు వచ్చేశారా? ఆడదానికి ఎందుకు స్వాతంత్ర్యం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? ఇప్పుడు ఎక్స్ పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనవద్దు అనుకున్నా.. అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం.. ఎప్పుడూ ఎదుటివాళ్లదే తప్పు అనడమే కాదు.. మనవైపు కూడా కొంచెం ఉంటుంది..’’ అంటూ అన్నపూర్ణ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు సాధారణంగానే వివాదస్పదమయ్యాయి. మహిళల డ్రెస్ కోడ్ గురించి తరుచుగా పురుష సమాజంతో పాటు పలువురు మహిళలు కూడా ఇలా మాట్లాడుతూనే ఉన్నారు. ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలపై చిన్మయి లాంటి వారు కౌంటర్ ఇస్తూనే ఉంటారు. కానీ అన్నపూర్ణమ్మ ఎపిపోడ్ లో చిన్మయి చేసిన వ్యాఖ్యలు హర్షించే విధంగా లేవని అంటున్నారు.

అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలపై చిన్మయి కౌంటర్ ఇస్తూ..తనకు బాగా నచ్చిన నటి అలా మాట్లాడడం గుండె పగిలినట్టు అనిపించిందన్నారు. అర్ధరాత్రి ఏ ప్రమాదాలు జరిగినా హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా ఆడదాన్ని ఇంట్లోనే ఉంచాలేమో అంటూ ఎద్దేవా చేశారు. ఆమె చెప్పినట్టు చేస్తే.. పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదు అంటూ లాజిక్ లేని కొన్ని వెటకారాలు కూడా చేశారు.

అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు ఆమె ఎన్ని కౌంటర్లు వేసినా ఇబ్బంది ఉండేది కాదు.. కానీ ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడం ఒక ఖర్మ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదమవుతున్నాయి. ఈ విషయంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. దేశాన్ని అవమానించేలా ఆమె మాట్లాడారని అంటున్నారు. పోలీస్ కేసు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఈ వ్యాఖ్యల ద్వారా చిన్మయి చేసింది మాత్రం కచ్చితంగా ఓవర్ యాక్షనే అని చెప్పవచ్చు.

చిన్మయి ఈ రకంగా కాకుండా మరోలా మాట్లాడితే ఈ వివాదం చెలరేగి ఉండేది కాదు. దేశంలో పుట్టడం ఖర్మ అని కాకుండా మహిళా స్వేచ్ఛ, దుస్తులు, ప్రవర్తన..ఇలా ఎన్నో రకాలుగా మాట్లాడి అన్నపూర్ణమ్మకు కౌంటర్ ఇవ్వొచ్చు. కానీ చిన్మయి కాస్త ఘాటుగా భారత్ లో పుట్టడమే వేస్ట్ అనే తరహాలో మాట్లాడడంతోనే ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version