Chetan Maini : డీజిల్, పెట్రోల్ కార్లను మాత్రమే వినియోగిస్తున్న జమానాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ అన్న ఆలోచన ఆటోమోటివ్ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలికింది. ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచనలో భాగంగానే పుట్టుకచ్చింది ‘రేవా’ (Reva). అసలు ఈ కారు ఎలా వచ్చింది? దీనికి కారుకులు ఎవరు? అనే వివరాలు తెలుసుకుందాం.
ఫ్యూయల్ కార్లు, ఎలక్ర్టికల్ కార్లు రెండింటిలో ఫ్యూయల్ కార్లయితే అందుబాటులోనే ఉన్నాయి. మరి ఎలక్ట్రానిక్ కార్లు వస్తే ఎలా ఉంటుంది. అనే ఆలోచన రావడమే తడవుగా దాని తయారీపై నిమగ్నమైపోయాడు ‘చేతన్ మైని’ (Chetan Maini). కాలుష్య రహిత సమాజం కావాలంటే ఎలక్ట్రిక్ వాహనమే దిక్కని భావించి ఆ దిశగా అడుగులు వేశాడు. ఆ అడుగులు ఎలక్ట్రిక్ కారు ‘రేవా’ వరకు తీసుకెళ్లాయి. ఆ రోజు పడిన అడుగే నేడు గణనీయమైన ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలకు మార్గదర్శనం అయ్యింది.
చేతన్ మైని గురించి..
1970, మార్చి 11న గళూరులో జన్మించారు చేతన్ మైని. తండ్రి సుదర్శన్ కే మైని. మిచిగాన్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 1992లో బ్యాచిలర్ డిగ్రీ, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో 1993లో మాస్టర్స్ పూర్తి చేశారు.
చదువు పూర్తయిన తర్వాత ప్రపంచానికి ఎలక్ట్రిక్ వెహికిల్ ఎంతో అవసరమని గ్రహించాడు. ప్రపంచం దాని వైపు పరుగులు తీస్తే భారత్ ను కూడా అందులో ముందు నిలపాలని ఆశించాడు. బెంగళూర్ లో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని దానికి నాయకత్వం వహించి.. రెండేళ్లలో ‘రేవా’ను తీసుకువచ్చాడు.
ఆ తర్వాత రేవా మహీంద్రా గ్రూప్‌తో చేతులు కలిపి ‘మహీంద్రా రేవా’గా ఏర్పడింది. ఇందులో ‘చేతన్’ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ చీఫ్‌గా పనిచేశారు. మూడేళ్ల పాటు పని చేసి కొత్త సాంకేతికత నిర్మించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా వచ్చిందే మహీంద్రా ఈ-20. ఆ సమయంలోనే ఈయన కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొన్నేళ్లు విధులు నిర్వహించిన ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈయన ‘సన్ మొబిలిటీ’ని వరల్డ్ వైడ్ గా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అచంచలమైన సంకల్పం, స్థిరమైన ఆవిష్కరణలలో భారత్ ను ప్రపంచ వేదికపై అగ్రగామిగా నిలపాలని మైనీ విశ్వసించారు. చేతన్ మైని దూరదృష్టి అపారమైంది, ఆయన ఆలోచనలను పరిశీలిస్తే.. అత్యున్నత భవిష్యత్ ఎలా సాధ్యమవుతుందని తెలుస్తుంది.