Tata Cancer Tablet : కేవలం రూ.100తో క్యాన్సర్ కు చెక్.. టాటా వారి అద్భుత ఆవిష్కరణ
Tata Cancer Tablet : ప్రాణాంతక వ్యాధులలో క్యాన్సర్ దే మొదటి స్థానం. వివిధ రకాల క్యాన్సర్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. వైద్య శాస్త్రంలో ఆధునికత, సాంకేతిక అభివృద్ధి క్యాన్సర్ చికిత్సలో సహాయపడింది. అయితే సాధారణ ప్రజలు క్యాన్సర్ చికిత్స పొందడం ఇప్పటికీ కష్టమే. క్యాన్సర్ మరణాలకు సకాలంలో వ్యాధి నిర్ధారణ లేకపోవడమే ప్రధాన కారణమని, చాలా మందిలో క్యాన్సర్ గణనీయంగా పురోగమించినప్పుడే గుర్తిస్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చౌకైన, సులభమైన క్యాన్సర్ చికిత్స పై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తల బృందం గొప్ప విజయాన్ని సాధించింది. ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్‌లోని నిపుణులు క్యాన్సర్ చికిత్సలో అపూర్వమైన ఆవిష్కరణ చేశారు. క్యాన్సర్ పునరావృతం కాకుండా నిరోధించడంలో.. క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాలను 50 శాతం తగ్గించడంలో సహాయపడే మాత్రను తాము అభివృద్ధి చేసినట్లు బృందం పేర్కొంది. ఈ ఔషధం కూడా చాలా పొదుపుగా ఉంటుంది. FSSAI నుండి అనుమతి పొందిన తర్వాత ఈ టాబ్లెట్ రూ. 100కి అందుబాటులో ఉంటుంది.
ఇప్పటివరకు చేసిన అధ్యయన నివేదికల ఆధారంగా క్యాన్సర్ చికిత్సలో దుష్ప్రభావాలను R+CU ఔషధం దాదాపు 50శాతం తగ్గించగలదని.. క్యాన్సర్ పునరావృతం కాకుండా నిరోధించడంలో 30శాతం సమర్థతను చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌లో ఈ టాబ్లెట్ ప్రభావవంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఔషధం ఆమోదం కోసం భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుంచి వేచి ఉంది. ఆమోదించిన తర్వాత టాబ్లెట్ జూన్-జూలై నాటికి మార్కెట్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
టాటా ఇన్స్టిట్యూట్కు చెందిన సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే మాట్లాడుతూ.. ఈ టాబ్లెట్‌కు అనుమతి లభిస్తే, దాని ధర చాలా తక్కువగా ఉంటుంది. దీని ధరను రూ. 100 కంటే తక్కువగా ఉంచే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా దీని ఉపయోగం సామాన్యులకు కూడా సులభం అవుతుంది. ప్రస్తుతం, క్యాన్సర్ చికిత్సలో ఈ ఔషధం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే ఇది క్యాన్సర్ తిరిగి పెరిగే ప్రమాదాన్ని కచ్చితంగా తగ్గిస్తుందని చెబుతున్నారు.