Bharti Reddy : ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం చాలా డబ్బులు వృథా చేసిందని టీడీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వాలంటీర్లకు న్యూస్ పేపర్ అలవెన్స్ కిందట కొంత డబ్బును నెలనెలా జారీ చేసింది. అయితే ఈ నెల వారీ భత్యం వల్ల ఏపీ ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుందో గణాంకాలతో సహా టీడీపీ బయటపెట్టింది. ప్రస్తుతం ఈ నష్టానికి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
గత వైసీపీ సర్కార్ సాక్షి పత్రికను కొనుగోలు చేయడానికి 2.6 లక్షల మంది వాలంటీర్లకు ప్రతి నెల రూ.200 ఇచ్చింది. ఇది సాక్షికి అందించే సాధారణ ప్రకటనల నుంచి వేరుగా ఉంది. ఈ భత్యం సాక్షి సర్క్యులేషన్‌కు ఉపయోగపడింది. అంటే అంత మంది పాఠకులు వారికి లభించినట్లే. అయితే, ఇప్పుడు టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి అధికారంలో ఉన్నందున, ఈ “సాక్షి” భత్యాన్ని నిలిపివేస్తూ కొత్త ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రతినెల రూ.5.3 కోట్లు లేదా సంవత్సరానికి సుమారు రూ.60 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
ఈ భృతిని నిలిపివేయడం ద్వారా ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.300 కోట్లు ఆదా చేయనుంది. ఈ మొత్తం సాక్షి జేబుల్లోకి వెళ్లకుండా ఆపింది. ఆ రూ.300 కోట్లు మిగుల్చుకొని రాష్ట్ర ప్రజలకి ఏదో ఒక మంచి చేసే అవకాశం ఉంది. ఆ డబ్బులతో రాష్ట్రంలోని 3.37లక్షల మందికి ఫించన్ ఇవ్వొచ్చు. ఇంకా వైసీపీ ప్రభుత్వం స్వలాభం కోసం ఇలాంటి ఎన్నో వృథా ఖర్చులు పెట్టుకొని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిందంటున్నారు. అవి కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చే చాన్స్ ఉంది. ఇంతకుముందు వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి అర్హత లేని వారికి ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చే అధికారాన్ని దుర్వినియోగం చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు జగన్ సొంత పత్రిక కోసం ప్రజా సొమ్మును వాడుకున్నట్లు తెలుస్తోంది.