Delhi court : జగదీశ్ టైట్లర్ పై అభియోగాలు నమోదు చేయాలి.. సీబీఐని ఆదేశించిన ఢిల్లీ కోర్టు
Delhi court : కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ కు వ్యతిరేకంగా అభియోగాలు నమోదు చేయాలని సీబీఐని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య నేపథ్యంలో చోటు చేసుకున్న 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు జగదీశ్ టైట్లర్ పై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. టైట్లర్ పై ఐపీసీ 143, 147, 153ఏ, 188, 295, 436, 451, 380, 149, 302, 109 సెక్షన్ల కింద విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది.
1984 నవంబర్ 1న పుల్ బంగాష్ గురుద్వారా సమీపంలో గుమిగూడిన గుంపును కేంద్ర మాజీమంత్రి టైట్లర్ రెచ్చగొట్టారని 2023 మేలో దాఖలు చేసిన చార్జిషీట్లో సీబీఐ ఆరోపించింది. గురుద్వారా ముందు తెల్లను అంబాసిడర్ కారు నుంచి బయటకు వచ్చిన టైట్లర్ సిక్కులకు వ్యతిరేకంగా అరుస్తూ జనాన్ని రెచ్చగొట్టారని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఆరోపించారు. అంతకుముందు రోజు ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు హత్య చేయడంతో ఆగ్రహించిన గుంపు ముగ్గురు వ్యక్తులను హతమార్చింది.