New Tax System : కొత్త పన్ను విధానంలో మార్పులు.. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంపు

New Tax System

New Tax System

New Tax System : మధ్యతరగతి, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మోదీ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. పన్ను చెల్లింపుదారుల స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.75 వేలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెంచారు. దీంతో కొత్త పన్ను శ్లాబ్‌లో మరోసారి మార్పులు చేశారు. ఈ బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాత పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని పెంచలేదు. అలాగే పన్ను రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి స్టాండర్డ్ డిడక్షన్‌లో పెరుగుదల ప్రయోజనం ఉండదు. అంటే, కొత్త పన్ను శ్లాబ్‌ను ఎంచుకున్న వారికి దాని ప్రయోజనం లభిస్తుంది. నిజానికి ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఆదాయపు పన్నులో సడలింపు ఇస్తారని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేశారు.  కానీ ఆర్థిక మంత్రి స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచడం ద్వారా ప్రభుత్వం పన్ను విధానంలో మార్పులు చేసింది. కొత్త పన్ను శ్లాబ్‌లో మార్పు వల్ల పన్ను చెల్లింపుదారులు కనీసం రూ.17500 ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి చెబుతున్నారు.

0 నుంచి 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు
3 నుంచి 7 లక్షల ఆదాయంపై 5శాతం ఆదాయపు పన్ను
7 నుంచి 10 లక్షల ఆదాయంపై 10శాతం ఆదాయపు పన్ను
10 లక్షల నుంచి 12 లక్షల ఆదాయంపై 15శాతం ఆదాయపు పన్ను
12 లక్షల నుంచి 15 లక్షల ఆదాయంపై 20శాతం ఆదాయపు పన్ను
 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30శాతం ఆదాయపు పన్ను

దీంతో పాటు ఆదాయపు పన్ను ప్రక్రియను మరింత సులభతరం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మూడింట రెండొంతుల మంది ప్రజలు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని చెప్పారు. కొత్త పన్ను విధానం ప్రజల్లో మరింత ప్రాచుర్యం పొందేందుకు స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచారు. అలాగే పన్ను శ్లాబులో కూడా మార్పులు చేశారు.

గతేడాది ప్రారంభంలో కొత్త పన్ను శ్లాబ్‌లో మార్పులు చేశారు.
ఇంతకుముందు ఈ కొత్త పన్ను స్లాబ్- 2023
రూ 0 నుండి రూ 3 లక్షలపై 0శాతం
రూ. 3 నుంచి 6 లక్షలపై 5శాతం
6 నుండి 9 లక్షల వరకు 10 శాతం
9 నుండి 12 లక్షల వరకు 15 శాతం
12 నుండి 15 లక్షల వరకు 20 శాతం
రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాటిపై 30శాతం (ఇప్పుడు ఈ పన్ను స్లాబ్ రద్దు చేయబడింది)

2020 సంవత్సరంలో  ప్రభుత్వం మొదటిసారిగా కొత్త పన్ను స్లాబ్‌ను ప్రవేశపెట్టింది. ఇది చాలా మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు నచ్చలేదు. ఆ తర్వాత అదే గత ఏడాది అంటే 2023లో మార్చబడింది. గతంలో 6 పన్ను శ్లాబులు ఉండగా, వాటిని 5 పన్ను శ్లాబులుగా మార్చారు. ఆ తర్వాత కూడా కేవలం 25 శాతం మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మాత్రమే కొత్త పన్ను శ్లాబును స్వీకరించారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి అందులో మార్పు వచ్చింది. కొత్త పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచారు.

TAGS