BC Scholarship Scheme : విదేశాల్లో చదువుకుంటున్న బీసీ విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. ఇంతకుముందు విదేశాల్లోని ఏ యూనివర్సిటీలో అయినా విద్య అభ్యసించేందుకు అనుమతి ఉండేది. ఇకపై అలా కాకుండా కేవలం 50 యూనివర్సిటీల్లో మాత్రమే చదువుకునేందుకు స్కాలర్ షిప్ అందజేయాలని భావిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పైరవీలతో దాదాపు 2700 మంది విద్యార్థులు ఏటా ఉన్నత చదువులు చదువుకునేందుకు విదేశాలకు వెళ్లేవారు. అందులో పైరవీకారులే అధికంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులో కోత విధించాలని చూస్తోంది. దీనికి గాను మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఎలా పడితే అలా అనుమతులు ఇవ్వకుండా అర్హులకే ఈ పథకాన్ని కొనసాగించాలని సంకల్పించింది. దీని కోసం పలు మార్గదర్శకాలను తీసుకొస్తోంది.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 5 లక్షల లోపు, అకడమిక్ మార్కులకు 60 శాతం, జీమ్యాట్/బీఆర్ఎస్ 20 శాతం, టోఫెల్, ఐలెట్స్, పీటీఈ పరీక్షల్లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజీ, ఆ మెరిట్ ఆధారంగా జాబితా రెడీ చేస్తున్నారు. సాంకేతిక విద్య, జేఎన్టీయూకు చెందిన సభ్యులతో ఏర్పాటైన స్టేట్ లెవల్ స్క్రీనింగ్ కమిటీకి ఆ జాబితాను పంపి అర్హులను ఎంపిక చేస్తారు.
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణి కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన వారికే ఈ పథకం వర్తింపచేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీ, మిచిగాన్ యూనివర్సిటీ, మిన్నె సోటా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన వారికే కాకుండా విదేశాల్లోని టాప్ 50 యూనివర్సిటీల్లో చేరిన వారికి కూడా ఓవర్సీస్ పథకం వర్తించేలా నిబంధనలు రూపొందించనున్నారు.
2023లో 642 ఈబీసీ విద్యార్థులున్నారు. సర్టిఫికెషన్ల పరిశీలన డిసెంబర్ 15 నుంచి ప్రారంభించారు. పథకంలో మార్పులు చేసినందున కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ ఏడాది 2665 మంది దరఖాస్తు చేసుకోవడంతో అందులో ఎందరికి పథకం వర్తింప చేస్తారో తెలియడం లేదు.