నవంబర్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించారు. ఆదివారం కావడంతో ముఖ్యమైన నేతలు అందుబాటులో ఉంటారో లేదోనన్న అనుమానంతో మరో తేదీన నోటిఫికేషన్ వెలువడుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.
మరోవైపు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం.. విద్యాశాఖను జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ లోగా ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా టెట్ నిర్వహించడంతో పరీక్షలు, నోటిఫికేషన్ ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డీఎస్పీని ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. డీఎస్సీ 2024 సిలబస్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించింది. సిలబస్ వివరాలను https://aptet.apcfss.inలో అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.