JAISW News Telugu

Minister Seethakka : ఆ జిల్లా పేరు మార్పు.. మంత్రి చొరవతో కలెక్టర్ ఆదేశాలు..

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka : ప్రాంతమైనా, గ్రామమైనా, జిల్లా అయినా పేరు పెట్టాలంటే ఒక చరిత్ర ఉండాలి. ఏదో ఒక పేరు పెడితే జనం ఒప్పుకోరు సరికదా.. ప్రాంతానికి కూడా సరైన గుర్తింపు దక్కదు. అలాంటిదే ములుగు జిల్లా. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మండల కేంద్రంగా ఉన్న ములుగు అనేక పోరాటాలు, నిరసనల తర్వాత జిల్లాగా ఆవిర్భవించింది. ఆ జిల్లాకు మండల కేంద్రమైన ములుగు పేరునే కొనసాగించింది గత ప్రభుత్వం.

ములుగు జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి. ఎక్కువ అటవీ భూమి ఉంది. కొలిచిన వెంటనే కోటి వరాలిచ్చే తల్లులు సమ్మక్క-సారలమ్మ కొలువైన నేల  ఇది. అందుకే ఈ నేల, ఇక్కడి ప్రజలు ప్రకృతితో కలిసి బతుకుతారు. ఆ జిల్లా పేరును మార్చాలని గతంలో చాలా ప్రతిపాదనలు వచ్చాయి. కానీ గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని మార్చాలని నిర్ణయం తీసుకుంది.

ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క సారక్క ములుగు’ జిల్లాగా మారుస్తూ కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు జిల్లా వ్యాప్తంగా బుధవారం (జూలై 3) ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క పేరు మార్పునకు అడుగు ముందుకేశారు. ‘సమ్మక్క సారక్క ములుగు’గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

మంత్రి చొరవ, ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ దినకర్ పేరు మార్పునకు చర్యలు మొదలు పెట్టారు. నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వారి అభ్యంతరాలు తెలియపరచాలని కోరారు. గ్రామసభ తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత గెజిట్‎లో ములుగుకు జిల్లా పేరు ‘సమ్మక్క సారక్క ములుగు’గా ఆమోదముద్ర లభిస్తుంది.

సమ్మక్క సారలమ్మలు కొలువుదీరిన మేడారం ఈ జిల్లా పరిధిలోనే ఉంది. వనదేవతలతో పాటు అనేక ప్రత్యేకతలు ఉన్నాయిక్కడ. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. యూనేస్కో గుర్తింపుపొందిన రామప్ప దేవాలయం  కూడా ఈ జిల్లాలోకే వస్తుంది. సమ్మక్క సారలమ్మ దేవతల పేరు చెప్పగానే ములుగు జిల్లా గుర్తుకొస్తుంది. కాబట్టి జిల్లాకు వనదేవతల పేర్లనే పెట్టాలని స్థానిక ప్రజలు అనేక సార్లు గత ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి సీతక్క చొరవతో ఎట్టకేలకు ఆ కల నెరవేరబోతుందని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version