Three Capitals : మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం..
Three Capitals : 93 శాతం సీట్లతో గెలవడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదని, ఇది కేవలం ఏపీకే దక్కిందని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్న ఆయన ఏన్డీయే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యావాదాలు చెప్పారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభాపక్ష భేటీ విజయవాడలో జరిగింది. సమావేశంలో ఎన్డీయే శాసన సభా పక్ష నేతగా బాబును ఎన్నుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సైకో జగన్ చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు చూపిన చొరవ అద్భుతం అని కీర్తించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పని చేసి వారి రుణం తీర్చుకోవాలని సూచించారు. ప్రజల తీర్పుతో బాధ్యత మరింత పెరిగిందని బాబు చెప్పారు.
కేంద్ర సహకారం ఉంది..
మీ ఆశీర్వాదం, సహకారంతో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఎప్పుడూ ఉంటుంది. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారు. మనం మరింత కష్టపడి రాష్ట్రాన్ని దేశంలో ఫస్ట్ ప్లేస్ లో నిలపాలి.
రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది..
‘14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ముందుకు ఎలా వెళ్లాలో తెలుసు. జగన్ తుగ్లక్ పాలనతో ఏపీ చాలా సమస్యలతో ఇబ్బంది పడుతోంది. మరో రకంగా చెప్పుకోవాలంటే రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది. సంక్షోభంలో ఉంది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి. రైతులు అప్పులపాలయ్యారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా రాజధాని ఏదంటే చెప్పుకోకుండా ఉంది. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలి. మూడు రాజధానులు, నాలుగు రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి ఉండదు. అమరావతే రాజధాని. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందాం’ అని బాబు వెల్లడించారు.