Chandrababu : మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఘటనలో గాయపడిన నంబూరి శేషగిరిరావుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు ధైర్యంగా ఉండాలని, టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించిన శేషగిరిరావుపై ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటన తరువాత శేషగిరిరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు కావడంతో అజ్ఞాతం వీడి బయటకు వచ్చి దాటి ఘటన వివరాలు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు శేషగిరిరావుతో ఫోన్ లో మాట్లాడి అభినందించారు.
పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో తాను ఏజెంట్ గా ఉన్న సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో వచ్చి స్వయంగా ఈవీఎం పగులగొట్టారని శేషగిరిరావు మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే చర్యలకు ఎన్నికల సిబ్బంది, ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేసిన తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబ సభ్యలకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.