Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఎన్డీయే కూటమిలో చర్చకు దారి తీస్తోంది. ఆయనకు కచ్చితంగా టికెట్ ఇస్తారని అంతా భావించినా సీట్ల సర్దుబాటులో భాగంగా నర్సాపురం టికెట్ బీజేపీ తీసుకుంది. దీంతో ఉండి టికెట్ అయినా రఘురామకు ఇవ్వాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు. టికెట్ రాకపోతే ఎలా అనే ఆందోళన రఘురామ శిబిరంలో మొదలైంది.
మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన జట్టు కట్టడంతో కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే నర్సాపురం టికెట్ బీజేపీ తీసుకోవడంతో రఘురామ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రఘురామ అనుచరులు ఆందోళన చేస్తుండడంతో చంద్రబాబు నుంచి రఘురామకు పిలుపు వచ్చింది. చంద్రబాబును కలిసిన రఘురామకు అభయం ఇచ్చారు. ఉండి సీటు అప్పగిస్తామని చెప్పారు. దీంతో ఆయన ఊరట చెందుతున్నారు.
జగన్ కారణంగా రఘురామ ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను కాపాల్సింది మనమే. అవకాశం ఇవ్వాల్సింది కూడా మనమే. అందుకే చంద్రబాబు రఘురామ విషయంలో అంతలా పట్టుబడుతున్నారు. నర్సాపురం సీటు విషయంలో మార్పు లేదని తెలియడంతో చంద్రబాబు చివరి ప్రయత్నాలు చేయడంతో పవన్ కల్యాణ్ సైతం చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
నర్సాపురం సీటు బదులు ఏలూరు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. సీటు విషయంలో ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. యలమంచిలి సీటు జనసేన నుంచి టీడీపీకి, మాడుగుల సీటు అభ్యర్థి మార్పు, తిరువూరులో అభ్యర్థి మార్పు గురించి డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సీట్ల విషయంలో చర్చలు కొనసాగే సూచనలున్నాయి.
దీంతో రఘురామకృష్ణంరాజుకు ఉండి సీటు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు గట్టిగా చెప్పనున్నారు. రఘురామకు ప్రత్యామ్నాయం చూపించే విషయంలో కడదాకా పోరాడనున్నారు. మొత్తానికి రఘురామ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశం అవుతోంది. రఘురామకు ఎలా దారి చూపుతారో అనే విషయంలో అందరూ ఆసక్తిగా ఉన్నారు.