Bhumana : అబద్దాన్ని నిజం చేయడానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు: భూమన
Bhumana Karnakar : అబద్దాన్ని నిజం చేయడానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారతారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. ఏపీలో తిరుమల లడ్డూ వివాదం రేపిన రాజకీయ దుమారం ఇంకా సద్దుమణగ లేదు. ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు చేరింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై ఈరోజు (సెప్టెంబరు 30) విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అబద్దాన్ని నిజం చేయడానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారతారని అన్నారు. ఆ దేవదేవుడే ధర్మాసనం రూపంలో వచ్చి నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు కాబట్టే ధైర్యంగా ప్రమాణం చేశామని అన్నారు. ఆలస్యంగానైనా నిజం నిగ్గు తేలుతుందని అన్నారు. ఎటువంటి విచారణ కానీ, సెట్ ఏర్పాటు కానీ జరగకముందే, చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిందని అన్నారు. దేవుడిని రాజకీయాల కోసం వాడుకోవద్దని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని అన్నారు.