Film actor Suman : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కార్యసాధకుడని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారని సినీ నటుడు సుమన్ కొనియాడారు. ఈరోజు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారు. గతంలో యువత ఉద్యోగాలు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమలోని వారు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ కు మంచి శాఖలనే కేటాయించారు. ఉపముఖ్యమంత్రిగా ఆయన తన సత్తా చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉందని తెలిపారు. అలీ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం ఆయన వ్యక్తిగతమన్నారు. అయితే, సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతాయని అనుకోవడం కరెక్ట్ కాదని, ప్రజాసేవ చేస్తే పదవులు వాటికవే వస్తాయని సుమన్ తెలిపారు.