Chandrababu : చంద్రబాబు మారాలట.. జగన్ చెప్పింది నిజమే!

Chandrababu

Chandrababu

Chandrababu : రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిందనుకోండి ఏం చేయాలి? ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఓడిపోయాం.. ఎక్కడ లోటు జరిగింది.. కారాణాలు ఏంటి? అని తెలుసుకునేందుకు లోతుగా అధ్యయనం చేయాలి. లోపాలను సరిదిద్దుకోవాలి. మారిన రాజకీయ పరిస్థితులను బట్టి ఆలోచనలు, దృక్పథం మార్చుకొని ప్రజల మధ్యకు వెళ్లాలి అప్పుడే సత్ఫలితాలు సాధ్యమని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నిరూపించి చూపారు.

కానీ పార్టీల్లో పేరుకుపోయిన బ్యూరోక్రసీ, హిపోక్రసీతో ‘ఆత్మ పరిశీలన’ ప్రక్రియ లాంఛనంగా మారింది. అందుకే తెలంగాణలో కేసీఆర్‌ ప్రజలను, ఏపీలో జగన్‌ ఈవీఎంలను నిందిస్తూ ‘మమ’ అనిపించేశారు. ఇలా చేయడం పార్టీకి మంచిది కాదని తెలిసినప్పటికీ అధినేతలకు అహం, పార్టీ నేతలకు నిస్సహాయత అడ్డొస్తుంటుంది. కనుక అందరూ కలిసి ‘మమ’ అనిపించేసి మళ్లీ ప్రజల మధ్యకు వచ్చేస్తుంటారు.

దీని వలన వారికే తప్ప ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు. కాబట్టి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ వారు మారాల్సి ఉండగా ప్రజలు, సీఎం, మంత్రుల తీరు మారాలని సుద్దులు చెప్పడం విడ్డూరం. చాలా ఏళ్ల తర్వాత జగన్‌ జైలులో అడుగుపెట్టారు. ఆయన పిన్నెల్లి కోసమే జైల్లో అడుగుపెట్టినప్పటికీ అది అశుభాన్ని సూచిస్తున్నట్ల ఉందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

పిన్నెల్లికి జగన్‌ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చి, చెప్పదలచుకున్న 4 ముక్కలు చెప్పేశారు జగన్. వాటిలో ఒకటి చంద్రబాబు ధోరణి మారాలని! టీడీపీ నేతలు, కార్యకర్తల మనసులో మాటను జగన్‌ చెప్పారనిపిస్తుంది. ఎందుకంటే వారు కూడా ఇదే కోరుకొంటున్నారు. బాబు ప్రతిపక్షంలో ఉన్న కాలం జగన్‌, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను భరిస్తూ జగన్ ను ధీటుగా ఎదుర్కొనేవారు. సీఎం అయ్యాక వారి పట్ల కటినంగా వ్యవహరిస్తారని అందరూ అనుకుంటే ఆయన ఏం చేస్తున్నారో చూస్తే తెలుస్తుంది.

బాబు చాలా సంయమనం పాటిస్తున్నారు. అందువల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఒప్పుకోక తప్పదు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ ఇండస్ట్రీ రావాలన్నా, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రావాలన్నా శాంతిభద్రతలు నెలకొని ఉన్నాయని, సరైన విధానాలు కలిగిన ప్రభుత్వం ఉందనే నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంటుంది.

జగన్‌ ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాలేదు. బహుషా జగన్‌కు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడుకి మాత్రం బాగా తెలుసు. అందుకే వైసీపీ పట్ల చాలా సంయమనం పాటిస్తున్నారని చెప్పవచ్చు. కానీ ఐదేళ్ల పాటు వైసీపీ దౌర్జన్యాలను భరించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికారంలోకి వచ్చాక కూడా చేతులు ముడుచుకొని కూర్చోవాలంటే అసహనంగానే ఉన్నారు. కనుక చంద్రబాబు మారాలని, జగన్‌తో సహా వైసీపీ నేతలందరితో కఠినంగా వ్యవహరిచాలని కోరుతున్నారు.

TAGS