Chandrababu : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు..శాశ్వత శత్రువులు ఉండరు.. అని పెద్దలు అంటుంటారు. రాజకీయాల్లో ఎవరి అవసరం ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి మనం కాదనుకున్న వారే అవసరం పడొచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకెళ్తోంది. ఇక టీడీపీ, జనసేన కూటమి నేతలు అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో, ప్రచారం వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఇదే తరుణంలో బీజేపీ తమతో కలిసి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డిని గద్దె దింపాలనే కృతనిశ్చయంతో ఆయన ముందుకెళ్తున్నారు.
బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, పవన్ అయోధ్యకు కూడా అందుకే వెళ్లారని అంటున్నారు. అక్కడ బీజేపీ పెద్దలెవరైనా కలిస్తే పొత్తు విషయంపై ఏమైనా హింట్ ఇస్తారేమోనని అనుకున్నారు. కానీ అక్కడ అది వీలుకాలేదు. అయితే టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ చేరాలని చంద్రబాబు కోరుకునేది కేసుల నుంచి బయటపడడానికే అని కొందరు ఆరోపిస్తున్నారు. సీబీఐ, ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికే బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
అయితే చంద్రబాబు ఉద్దేశాన్ని గమనిస్తే.. కేసుల గురించి భయపడి బీజేపీతో పొత్తు కోరుకుంటున్నారని అనలేం. ఎందుకంటే ఆయన బీజేపీ పొత్తు లేకుండానే ప్రతిపక్ష నేతగా 5ఏండ్లు గడిపాడు. బీజేపీతో పొత్తు అవసరానికి కేసుల కన్నా.. రాజకీయ అవసరాలే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీ అధినేత, సీఎం జగన్ రెడ్డి అధికారంలో ఉండడం ఆయనకు బోనస్. ఎన్నికల వేళ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోల్ మేనేజ్ మెంట్ చేయవచ్చు. వ్యవస్థలను తారుమారు చేయవచ్చు. ఎన్నికల సంఘం ఉన్నప్పటికీ అధికార పార్టీ కొన్ని అడ్వాంటేజీలు ఉంటాయి. వాటిని విరివిగా వాడుకోవచ్చు. అదే కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉంటే వీటికి జగన్ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయవచ్చు అని చంద్రబాబు భావిస్తున్నారు.
ఒకవేళ బీజేపీ ఒంటరిపోరు చేస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోతుంది. అంతిమంగా ఇది జగన్ కు లబ్ధి చేకూరవచ్చు. కొద్దిపాటి ఓట్ల శాతం కూడా అధికారాన్ని దూరం చేయవచ్చు. కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవద్దు అని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అంతా కూటమికే పడుతుంది. దీని ద్వారా అధికారంలోకి రావచ్చు.
బీజేపీతో పొత్తు ద్వారా లాభమే తప్ప నష్టం ఉండదు అని భావించే చంద్రబాబు తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా ఈసారి జగన్ గెలవద్దు..ఆయన మరోసారి గెలిస్తే రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి వెళ్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. మళ్లీ జగన్ వస్తే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయని, అభివృద్ధి, ఉపాధి లేక జనాలకు ఇబ్బందులు తప్పవని..దీనికి పరిష్కారం కూటమి అధికారంలోకి రావడం తప్ప మరేది లేదని ఆయన నమ్ముతున్నారు. అందుకే బీజేపీ తమతో కలిసిరావాలని చంద్రబాబు కోరుతున్నారు.