Chandrababu : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లగా చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి ఉన్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు లోకేశ్ కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు.
ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. ఇంతకాలం ఎంతో శ్రమించిన నేతలు ఇప్పుడు రిలాక్స్ మూడ్ లోకి వెళ్లారు. సీఎం జగన్ కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు కూడా సతీసమేతంగా అమెరికా వెళ్లారు. జగన్ లండన్ పర్యటన గురించి మీడియాలో మారుమ్రోగింది. కానీ, చంద్రబాబు అమెరికా పర్యటన గురించి మాత్రం మీడియాలో ఎలాంటి హడావుడి కనిపించలేదు.