King Maker : చంద్రబాబు ది కింగ్ మేకర్: నేషనల్ మీడియాలో మోతమోగుతున్న టీడీపీ అధినేత పేరు!
King Maker : ఒక్క ఎలక్షన్.. టీడీపీకి వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. మరో కొన్నేండ్లపాటు వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా చేసింది. చంద్రబాబు నాయుడిని మరోసారి జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా నిలిపింది. ఇప్పుడు దేశమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ చంద్రబాబు పేరు మారుమోగిపోతోంది. అంబరమంతా విజయాన్ని కట్టబెట్టి చంద్రబాబుకు మరోసారి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పారు ఏపీ ప్రజలు. చంద్రబాబు పనితనం, సమర్థత, దార్శనికత, కార్యదక్షత, రాజకీయ చతురతపై జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఏ చానల్ చూసినా, ఏ పత్రిక చదివినా ఒకటే పేరు వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు ది కింగ్ మేకర్..
తాజాగా ఇండియా టుడే టీవీ చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్తానంపై ఓ బులిటెన్ చేసింది. అందులో చంద్రబాబును కింగ్ మేకర్ గా కొనియాడింది. గతంలో వాజ్ పేయి హయాంలో చక్రం తిప్పిన చంద్రబాబు.. మోడీ 3.0 పాలనలో కూడా కింగ్ మేకర్ గా ఉండడంపై ప్రశంసలు కురిపించింది. చంద్రబాబు రాజనీతిజ్ఞత, దార్శనికత, పనిచేసేతత్వం, వ్యవస్థ నిర్మాణశీలతను గురించి పొగిడింది.
చంద్రబాబు సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొంది. కాలేజీ చదువుల నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని కాంగ్రెస్ యువనేతగా ఎదిగారని తెలిపింది. తర్వాత మామ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత నాదెండ్ల వెన్నుపోటు ఘటనలో తన రాజకీయ చాణక్యంతో పార్టీని కాపాడిన ఘనత చంద్రబాబుది అని పేర్కొంది. ఆ తర్వాత ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మిపార్వతి కబంధహస్తాల నుంచి..పార్టీని కాపాడేందుకు మెజార్టీ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని సీఎం అయ్యారన్నారు. టీడీపీని కాపాడిన చంద్రబాబు తన హయాంలో మరింత ఎత్తుకు తీసుకెళ్లారన్నారు.
ఆ తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని పట్టాలెక్కించి హైటెక్ సిటీ నిర్మాణంతో ప్రపంచ పటంలో నిలిపారన్నారు. వరుసగా రెండోసారి గెలిచి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో దేశంలో పేరుతెచ్చుకున్నాయంటే దానికి చంద్రబాబు ముందుచూపే కారణమని మెచ్చుకుంది. ఇక ఆతర్వాత వరుసగా 10ఏండ్లు ప్రతిపక్షనేతగా, 2014లో మరోసారి సీఎంగా, 2019 నుంచి ప్రతిపక్షనేతగా, మళ్లీ 2024లో ఏపీకి నాలుగోసారి సీఎంగా పనిచేయడం చంద్రబాబు ఒక్కరికే సాధ్యమైందని పేర్కొంది.
ఇలా జాతీయ మీడియాలో చంద్రబాబుపై ఎన్నో కథనాలు వస్తున్నాయి. వాటిని చూసి తెలుగు తమ్ముళ్లు..ఇది కదా చంద్రబాబు రేంజ్ అని సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో సంబంధిత కథనాలను వైరల్ చేస్తున్నారు.