JAISW News Telugu

Chandrababu Strategy : చంద్రబాబు వ్యూహమే వేరు.. అన్నీ అలా కలిసొస్తున్నాయ్..!

Chandrababu Strategy

Chandrababu Strategy

Chandrababu Strategy : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధరుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు దశాబ్దాలకు పైబడిన ఆయన రాజకీయ జీవితమే దాన్ని చెబుతుంది. 15 ఏండ్లు సీఎంగా, పదహేనేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అనుభవం చంద్రబాబుకే సొంతం. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు ఎవరికీ అంతుపట్టవు. పాలనలోనూ, పార్టీ నిర్మాణంలోనూ ఆయనకు ఆయనే సాటి.

ప్రస్తుత ఎన్నికల్లో సీఎం జగన్ ను గద్దె దించి, టీడీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఈక్రమంలో వివిధ పరిణామాలు ఆయనకు కలిసొచ్చేవిగా కనపడుతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా జనసేనతో పొత్తు పెట్టుకోవడమే ఆయన స్ట్రాటజీలో మొదటి విజయంగా భావించవచ్చు. ఆ తర్వాత పవన్ ద్వారా కూటమిలో బీజేపీ చేర్చే వ్యూహం తక్కువదేమి కాదు. తాను బీజేపీ వద్దకు కాకుండా..వారే తన వద్దకు వచ్చేలా ప్రొజెక్ట్ చేయడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ అధికారంలోకి రానివ్వకుండా చేయాలంటే బీజేపీతో పొత్తు అనివార్యం. రెండో సారి ఎన్నికల్లో గెలవడానికి జగన్ తనదైన వ్యూహాల్లో ఉన్నారు. వివిధ పథకాల ద్వారా నగదు బదిలీలు చేయడమే కాదు.. ఎన్నికల్లో గెలవడానికి డబ్బు పంపిణీ కూడా భారీగానే చేసే అవకాశాలు ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు అవసరం. తద్వారా ఎన్నికల్లో వైసీపీ డబ్బులు పంచకుండా చూడవచ్చు. దీంతో తమ విజయావకాశాలను పెంచుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.

ఇక జగన్ ను నైతికంగా దెబ్బతీయడానికి వైఎస్ షర్మిల, వైఎస్ సునీతా రెడ్డి కూడా దోహదపడనున్నారు. కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల.. జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సొంత చెల్లెలు అన్నపై తీవ్ర విమర్శలు చేస్తుండడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇక చిన్నాన్న వివేకా హత్య విషయంలో సునీతా రెడ్డి జగన్ ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలు ఎంతో కొంత జగన్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేవే.

ఇలా ఏపీలో ప్రస్తుతం నెలకొన్న వివిధ పరిణామాలు జగన్ కు తలనొప్పిగా, చంద్రబాబుకు మైలేజీ ఇచ్చేవిగా ఉన్నాయి. వీటిని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకోవడం తేలిక. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా..’ చంద్రబాబు రాజకీయ వ్యూహంలో ఇతరులు వారికై వారు పాలుపంచుకోవడం గమనార్హం.

Exit mobile version