Chandra babu:విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన `యువగళం-నవశకం` సభ ద్వారా తేదేపా – జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. పొత్తుపై ఇరు పార్టీల నేతలు రాష్ట్ర ప్రజలకు స్ఫష్టతనిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపా ఓటమి ఖాయం అన్నారు. ఆయన మాట్లాడుతూ `భారత దేశంలో పాదయాత్రలు చేయడం కొత్త కాదు. నేను కూడా పాదయాత్ర, బస్సు యాత్ర చేశా. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మొదటిసారి ఎన్టీఆర్ గారు చైతన్య యాత్ర చేశారు.
అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి. 45 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పాదయాత్రలు చూశా. కానీ ఎప్పుడూ పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవు. మొదటి సారిగా సైకో జగన్ పాలనలోనే ఇలాంటి ఘటనలు చూశాం. ఇక పవిత్రమైన భావనతో పాదయాత్ర చేస్తున్నప్పుడు చేతనైతే సహకరించాలి. లేదంటే ఇంట్లో కూర్చోవాలి. పోలీసులను అడ్డంపెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. యువగళం వాలంటీర్లకు జైలుకు పంపారు. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. యువగళం ప్రజా గర్జనకు నాంది పలికింది. ప్రజల్లో ఉండే బాధ, ఆక్రోశం, ఆగ్రహం యువగళంలో చూపించారు.
వైకాపా నేతల కబ్జాలతో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది. మెడపై కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు. ఒకప్పుడు విశాఖ ఆర్థిక రాజధాని. కానీ ఇప్పుడు గంజాయి రాజధానిగా మారింది. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. విధ్వంస పాలనకు జగన్ నాంది పలికాడు. వైకాపా పాలనలో కంపెనీలన్నీ పోయాయి. రుషికొండను బోడిగుండు చేసి సీఎం నివాసం కోసం రూ.500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారు? అంటూ ఫైర్ అయ్యారు.
త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి తేదేపా, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించుకున్నాం. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటూ అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేస్తాం. అగ్రవర్ణాల పేదలను ఆదుకుంటా. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తాం` అన్నారు.