CM Chandrababu : మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడంటూ లోకేష్ ను ప్రశంసించిన చంద్రబాబు
CM Chandrababu : ఎన్నికల హామీ ప్రకారం ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఉదయం ఆరు గంటల నుంచే సచివాలయం సిబ్బంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. పండగ వాతావరణంలో మొదలైంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం ఇదే. ఎన్నికల్లో ఇచ్చిన తొలి హామీ ఇదే కావడంతో ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో ఈ రోజు ఉదయం స్వయంగా అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛన్ మొత్తాన్ని అందజేశారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది. పింఛన్ల పంపిణీ సందర్భంగా చంద్రబాబు ఓ లబ్ధిదారుడి గుడిసెలోకి వెళ్లారు. కుటుంబ సభ్యుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలు ఏం చదువుతున్నారంటూ ఆరా తీశారు.
మీరు ఇంకా బాగా చదవాలంటూ వారి బిడ్డలను ప్రోత్సహించారు. తల్లిదండ్రులను కష్టపెట్టకూడదని సూచించారు చంద్రబాబు. కూలిపనులు చేసుకుంటూ చదివిస్తున్నారని, క్లాస్‌లో అందరికంటే చదువులో ముందు ఉండాలని మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. ఆర్థికంగా ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటానని చంద్రబాబు ఆ లబ్ధిదారుడి కుటుంబానికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని.. ఇంకా ఎక్కువ కష్టపడి అదనపు ఆదాయాన్ని పొందాలంటూ లబ్ధిదారుడికి సూచించారు. పక్కా ఇంటిని మంజూరు చేయిస్తానంటూ భరోసా ఇచ్చారు. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు.. అంటూ మంత్రి నారా లోకేష్ ను పొగిడారు. పెనుమాక- నారా లోకేష్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మంగళగిరి అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది.
ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొత్తం లోకేష్ పర్యవేక్షణలోనే సాగింది. ఇది విజయవంతం కావడం చంద్రబాబులో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షలమంది వయోధిక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని ఇదివరకే పెంచింది. పింఛన్ కింద గత ప్రభుత్వం రూ.3,000లు చెల్లించగా.. ప్రస్తుతం ఈ మొత్తం రూ.4,000లు చేరింది.