Tamil Nadu CM Stalin : కేంద్రంలో కీలకపాత్ర చంద్రబాబుదే: తమిళనాడు సీఎం స్టాలిన్
Tamil Nadu CM Stalin : ఏపీ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేటి జాతీయ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబుకు దేశ వ్యాప్తంగా విజనరీ నేతగా పేరున్న విషయం తెలిసిందే. తన పొలిటికల్ కెరీర్ లో 14 ఏండ్లు సీఎంగా, మరో పదహేనేళ్లు ప్రధాన ప్రతిపక్షనేతగా సుదీర్ఘ అనుభవం గడించారు. జాతీయ స్థాయిలో ఆయన రాజకీయ అనుభవాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవిస్తారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే చంద్రబాబు గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు.
బుధవారం ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్డీఏలో కీలకవ్యక్తిగా మారిన చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే దాక మీడియా అంతా ఆయన చుట్టూరే తిరిగింది. ఎంతోమంది ఆయనతో సెల్ఫీలకు పోటీ పడ్డారు. ఎన్డీఏ మీటింగ్ లోనూ చంద్రబాబుకు మంచి ప్రాధాన్యం దక్కింది. చంద్రబాబును మోదీ పక్కనే కూర్చుండబెట్టుకున్నారు. మొత్తానికి ఎన్డీఏలో మోదీ తర్వాత చంద్రబాబే కీలకంగా మారారు.
ఈనేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్..చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో టీడీపీ అధినేత కీలకపాత్ర పోషిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. ఎన్డీఏ సమావేశం కోసం చంద్రబాబు, ఇండియా కూటమి సమావేశం కోసం స్టాలిన్ ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో కలిశారు. అద్భుత విజయం సాధించిన చంద్రబాబును స్టాలిన్ సన్మానించి కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల వాణిని చంద్రబాబు బలంగా వినిపిస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. కరుణానిధికి దీర్ఘకాల స్నేహితుడైన చంద్రబాబును ఎయిర్ పోర్ట్ లో కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇరురాష్ట్రాల మధ్య సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తన ట్వీట్ లో రాసుకొచ్చారు.