Chandrababu-Amit Shah : ఢిల్లీలో అమిత్ షా కాళ్లు మొక్కిన చంద్రబాబు..? భగ్గుమంటున్న తమ్ముళ్లు.. అసలేం జరిగింది..
Chandrababu-Amit Shah : ఏపీలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది దుష్ప్రచారం పెరిగిపోతోంది. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడానికి, నేతల పరువు తీయడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. ఏది వాస్తవమో? ఏది అబద్ధమో తెలియకుండా జనాలను అయోమయంలో పడవేస్తున్నారు. సోషల్ మీడియాలో తమకు నచ్చనివారిపై అబాంఢాలు వేస్తూ, జరగని దాన్ని జరిగినట్టుగా, చేయని దాన్ని చేసినట్టుగా చూపుతూ తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పోరాట పటిమచూపకుండా.. ‘సెల్ డబ్బా’ల్లో తమ క్రౌర్యపు బుద్ధిని ప్రదర్శిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఇప్పటికే ఏపీలో ఎన్నికలకు సంబంధించి రాజకీయాలు కొనసాగుతున్న సమయంలో టీడీపీ, జనసేన పొత్తులను ప్రకటించి.. బీజేపీని కూడా కలుపుకోవాలని ముందుకెళ్తున్నాయి.
ఈక్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కానున్నారని సమాచారం. అయితే రెండు పార్టీలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన ఫొటోలు వైరల్ గా మారాయి.
ఈ ఫొటోల్లో చంద్రబాబు వంగి అమిత్ షా కాళ్లు మొక్కడం ప్రధానంగా కనిపిస్తోంది. అంతేకాదు మెట్రోలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చున్నట్టుగా కూడా మరో ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చర్చల కోసం వెళ్లిన చంద్రబాబు..ఢిల్లీలో చేసేది ఈ పనేనంటూ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
అయితే ఈ ఫొటో మార్ఫింగ్ చేసి, ఎడిట్ చేసిన ఫొటో అని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం హోదాలో చంద్రబాబు యోగాసనాలు వేసిన సమయంలో ఆయన వంగిన ఫొటోను, బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషికి అమిత్ షా నమస్కరిస్తున్న ఫొటోను జతచేసి ఈ ఫొటోను సృష్టించినట్టు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
గతంలో మెట్రో రైలులో ప్రధాని నరేంద్ర మోదీ యువతతో ముచ్చటిస్తున్న ఫొటోను ఎక్కడో చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చున్న ఫొటోను కలిపి ఎడిట్ చేశారని అంటున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చేసింది ఇదేనని, అవసరానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు మార్ఫింగ్ చేసిన వారిపై మండిపడుతున్నారు. ఇలాంటి ఫేక్ రాజకీయాలు మానుకోవాలని, ఏదన్నా ఉంటే ప్రజల ముందే తేల్చుకోవాలని సవాల్ విసురుతున్నారు.