Chandrababu : దేశంలో, ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో నేతలంతా కలియుగ వైకుంఠ దైవం తిరుమలేశుడిని దర్శించుకునేందుకు తిరుపతి బాట పడుతున్నారు. తాజాగా తిరుమల వేంకటేశ్వరుడిని ఏపీ సీఎంగా ఎన్నికైన నారా చంద్రబాబు తన కుటుంబంతో సహా దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక కేంద్రమంత్రి పీయూష్ గోయల్, టీడీపీ నేత నారాయణలు కుటుంబంతో సహా దర్శించుకున్నారు. చంద్రబాబుతోపాటు వీరు తిరుమలేషుడి సేవలో తరించారు.
చంద్రబాబు సతీమణి, కుమారుడు నారా లోకేష్, కోడలు, ఇతర బంధువులతో సహా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్లి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని రాత్రి బస చేశారు. గురువారం తెల్లవారుజామున ఆయన పవిత్ర తిరుమల వేంకన్న ఆలయంలో ప్రార్థనలు చేశారు.
అనంతరం చంద్రబాబు నాయుడు అమరావతికి తిరిగి వచ్చి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ఉపాధ్యాయుల నియామకం, లబ్ధిదారులకు సామాజిక పెన్షన్ పెంపుదల, అన్నా క్యాంటీన్లు, నైపుణ్య శిక్షణకు సంబంధించినవి ఇతర ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు.