Chandrababu : ఓటేసిన చంద్రబాబు, పవన్, బాలయ్య దంపతులు, ప్రముఖులు వీరే..
Chandrababu Vote : ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కు జనాలు పోటెత్తారు. ఓటర్లు ఉదయాన్నే వేలాదిగా పోలింగ్ బూత్ ల వద్దకు తరలివచ్చారు. కృష్ణా జిల్లా ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి ఓటర్లు మద్దతు పలుకుతున్నారని తెలిపారు.
తమను గెలిపించడానికి ఎక్కడెక్కడి నుంచో తెలుగు వారందరూ ఏపీకి వచ్చారన్నారు. విదేశాల్లో నివసించే తెలుగు వాళ్లు సైతం టీడీపీకి ఓటు వేయడానికి ఇక్కడికి చేరుకున్నారన్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో నివసించే తెలుగు ఓటర్లు కూడా భారీ ఎత్తున ఏపీకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఓటు వేయడానికి ఇంతమంది తరలిరావడం తన రాజకీయ జీవితంలో తొలిసారిగా చూస్తున్నానని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనమన్నారు.
మంగళగిరిలో పవన్ కల్యాణ్ ఓటు వేసి ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరతో కలిసి ఆర్టీసీ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజమహేంద్రవరంలోని వీఎల్ పురంలో లోక్ సభ అభ్యర్థి పురందేశ్వరి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కరువు..
ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే పలుచోట్ల వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. పలు తాగడానికి తాగునీటి సౌకర్యం కరువైంది. అలాగే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం వీల్ ఛైర్లు లేవు. ఎండలోనే ఓటర్లు బారులు తీరారు. కనీసం షామియానాల ఏర్పాట్లు లేవు. బెంచీలు, కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల తాగునీటి సౌకర్యం లేక క్యూలో గంటల తరబడి నిలబడి ఉండలేక వెనుదిరిగారు.