NITI Aayog meeting : ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీపై.. ఏపీ సీఎం చంద్రబాబు వీర విధేయత ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రానికి కేవలం రెండంటే రెండే మంత్రి పదవులు కేటాయించినా, నేరుగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం ముందుకు రాకపోయినా ఆయన మాత్రం ప్రధాని మోడీపై విధేయత కొనసాగిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. అయితే ఇదే భేటీకి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా పలువురు విపక్ష ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. అలాగే ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన నితీష్ కుమార్ సైతం హాజరు కాలేదు. ఆయన తరఫున ప్రతినిధులను మాత్రమే పంపించారు. అయినా చంద్రబాబు మాత్రం స్వయంగా హజరై తన ప్రతిపాదనలు నీతి ఆయోగ్ ముందుంచారు. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీలో పరిస్ధితులు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రాష్ట్రం భారీగా అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఇలాంటి కీలక సమయంలో నీతి ఆయోగ్ భేటీకి హాజరవడం ద్వారా కీలక అంశాల్లో సహకారం అందుకోవాలనేది సీఎం చంద్రబాబు ఉద్దేశం. అదే సమయంలో ఎన్డీయేలో బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షంగా కూడా చంద్రబాబు మరోసారి అందరినీ ఆకర్షించారు. ఇంతకుముందు ఆయన 2018 జూన్ 17న జరిగిన నీతి ఆయోగ్ 4వ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు. వికసిత్ భారత్‌పై చంద్రబాబు ఈ సమావేశంలో తన అభిప్రాయాలను ప్రకటిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే గత ఐదేళ్లలో విధ్వంసమైన ఏపీ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా వివరించి, దాన్ని పట్టాలపైకి తెచ్చేందుకు తీసుకోవల్సిన చర్యలను ప్రతిపాదించారు.