Modi-Chandrababu : ఏపీ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయదుందుభి మోగించడంతో చంద్రబాబు మరోసారి జాతీయ రాజకీయాల్లో కీలకనేతగా మారారు. కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీకి అత్యంత ప్రాధాన్యం దక్కనుంది. గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో ఎన్డీఏ కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు హవా నడిచిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలు ఇచ్చిన బంపర్ మెజార్టీతో చంద్రబాబు మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు.
నిన్న నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు చంద్రబాబుకు పెద్దపీట వేశారు. చంద్రబాబును మోదీ పక్కనే కూర్చుండబెట్టుకున్నారు. ప్రధానితో చంద్రబాబు గత అనుభవాలను పంచుకుంటూ నవ్వుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ సమావేశంలోనే మోదీని తమ నాయకుడిగా ఎన్నుకుని ఎన్డీఏ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు.
ఈ సమావేశం అనంతరం చంద్రబాబు ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్నారు. కూటమి భేటీ ఎలా జరిగిందని అక్కడి విలేకరులు ప్రశ్నించగా..ఫలవంతంగా సాగిందని చంద్రబాబు బదులిచ్చారు. మీరు ఎన్డీఏలోనే ఉన్నారా? అన్న ప్రశ్నకు..ఎన్డీఏలో లేకపోతే కలిసికట్టుగా ఎలా పోటీ చేస్తాం? రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసే పోటీ చేసినప్పుడు మీకెందుకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి అంటూ చంద్రబాబు వారిని ఎదురుప్రశ్నించడం గమనార్హం.
కాగా, ఎన్డీఏ సర్కార్ లో చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యం ఉండబోతున్నట్టు బీజేపీ పెద్దల వ్యవహారశైలిని చూస్తే అర్థమవుతోంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో కీలక పదవులు వరించే అవకాశాలు కనపడుతున్నాయి. దాదాపు ఐదు మంత్రి పదవులు డిమాండ్ చేస్తారనే టాక్ వినపడుతుంది. అయితే ఈ విషయమై చంద్రబాబు ఎక్కడా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. దీనిపై ప్రధాని ప్రమాణ స్వీకారం చేసే ఈనెల 9వ తేదీ వరకు ఓ క్లారిటీ రావొచ్చు. అలాగే ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి.