Chandrababu New Formula : ఏపీ ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. అదే జరిగితే ఏప్రిల్ లో తొలి విడతలోనే ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉంటాయి. దీంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టే. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కూడా ఖరారైనట్టే. ఇక వారి సీట్ల పంపకమే మిగిలింది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
వాస్తవానికి టీడీపీలో సీట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. అందులో మళ్లీ బీజేపీ, జనసేనకు కేటాయించే సీట్లతో సమస్య మరింత తీవ్రం కానుంది. ఈ ఎన్నికలు టీడీపీకి ఓ రకంగా జీవన్మరణ సమస్యే. అందుకే ఎలాగైనా గెలవాల్సిందే అనే భావనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు ఓ కొత్త ఫార్ములాతో అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.
టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాబు ఇప్పటికే కొలిక్కి వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ లోకి బీజేపీ ఎంటర్ కావడంతో మరోమారు చర్చలు జరపాల్సి ఉంటుంది. బీజేపీ, జనసేన కలిపి 50 అసెంబ్లీ సీట్ల వరకు ఆశిస్తున్నాయి. అలాగే 10 ఎంపీ సీట్లు కావాలంటున్నాయి. అయితే చంద్రబాబు 35 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి బీజేపీ నేతలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. కనీసం 40-45 సీట్ల వరకు మిత్రపక్షాలకు కేటాయించే ఆలోచన ఉందని టీడీపీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ ఇన్ చార్జుల్లో కనీసం 15-20 మందిని మార్చే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.
బీజేపీ, జనసేనలకు సీట్ల కేటాయింపుతో టీడీపీ పోటీ చేసే సీట్లు తగ్గుతాయి. కాబట్టి జాగ్రత్తగా సీట్ల పంపిణీ చేయాల్సి ఉంటుందని సీనియర్లకు ఇప్పటికే చంద్రబాబు సూచించారు. అయితే సీనియర్ల కుటుంబాల నుంచి ఒకటి కంటే ఎక్కువ సీట్లు కేటాయించాలనే అభ్యర్థనలు వస్తున్నాయి. దీనికి చంద్రబాబు ఫ్యామిలీకి ఒకే టికెట్ మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పారు.
ఇప్పటికే పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలకు ఒకే టికెట్ ఇస్తామని క్లారిటీ ఇచ్చేశారు. అలాగే సీట్ల మార్పుపైన సంకేతాలు ఇస్తున్నారు. మైలవరం విషయంలో అభ్యర్థి మార్పునకు ఉమకు సంకేతాలిచ్చినట్టు చర్చ జరుగుతోంది. పెడనలో కాగిత కృష్ణ ప్రసాద్ ను పని చేసుకోమ్మని చెప్పినట్టు సమాచారం. అవనిగడ్డ సీటును జనసేన కోరుతుండడంతో చర్చలు ఆనివార్యమే.
అటువైపు వైసీపీ అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఇప్పటికే పర్యటనలు సైతం చేస్తున్నారు. దీంతో సాధ్యమైనంత వరకు పొత్తుల లెక్కలు తేల్చుకుని సీట్ల పంపకాలు పూర్తి చేసి జనాల్లోకి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. అక్కడక్కడ చిన్న సమస్యలు వచ్చినా మూడు పార్టీల కార్యకర్తలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు, పవన్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. ఆ యాత్రలోనే బీజేపీ పెద్దలతో పొత్తుల విషయమై అధికారిక ప్రకటన చేయించాలని భావిస్తున్నారు.