Chandrababu : అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు మార్క్.. గెలువడమే లక్ష్యం.. అందుకే ఎంతటి రిస్క్ అయినా..

Chandrababu

Chandrababu

Chandrababu :  ఏపీలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్ వంటి వాటిపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టీడీపీ మూడో జాబితాను కూడా విడుదల చేసింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు జాబితాను చూస్తే అర్థమవుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటివరకు తమ పార్టీ నుంచి 139 మంది అభ్యర్థులను ప్రకటించారు. 13 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. అభ్యర్థుల పనితీరు, ప్రజలతో మమేకమవుతున్న అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అవసరమైతే అభ్యర్థుల మార్పునకు సైతం వెనుకాడనని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో భాగంగా సర్వేలతో పాటుగా స్థానికంగా ఉన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. పలువురు సీనియర్లకు ఇప్పటికీ సీట్లపైన స్పష్టత రాలేదు. అందులో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు విజయనగరం జిల్లా గజపతినగరంలో నిలుపాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ఎచ్చర్లకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీకాకుళం అసెంబ్లీ సీటును  బీజేపీకి ఇచ్చిన టీడీపీ ఇప్పుడు ఎచ్చెర్లను కేటాయించింది.

కొద్దిరోజుల క్రితమే గజపతి నగరానికి కొండపల్లి శ్రీనివాస్ ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆయనకు స్థానికంగా అనుకూలత లేదని పార్టీ తాజాగా గుర్తించింది. చీపురుపల్లికి ప్రస్తుతం కిమిడి నాగార్జున ఇన్ చార్జిగా ఉన్నారు. అక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. గంట తనకు భీమిలి కేటాయించాలని కోరుతున్నారు. ఈ సీటుపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెండింగ్ లో ఉన్న దర్శి నియోజకవర్గం నుంచి ఎన్నారై గరికపాటి వెంకట్, గోరంట్ల రవికుమార్, గొట్టిపాటి లక్ష్మీ పేర్లు వినపడుతున్నాయి. వీరిలో ఒకరికి సీటు దక్కే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్, గుంతకల్లు, రాజంపేట, ఆలూరు సీట్ల పైన ఇంకా నిర్ణయం జరుగలేదు. ఆదోని సీటును బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థానంలో ఆలూరు సీటును ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి.

ఎంపీ స్థానాల్లో ఇంకా ఒంగోలు, అనంతపురం, రాజంపేట అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఒంగోలు నుంచి తిరిగి మాగుంట శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయనున్నారు. నామినేషన్ల సమయం వరకు గెలుపే ప్రామాణికంగా పూర్తి సమాచారం సేకరిస్తామని అవసరమైన చోట్ల మార్పులు తప్పవని చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారు. సీటు దక్కకపోవడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని తొలుత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భావించారు. తాజాగా ఆయన చంద్రబాబును కలిశారు. అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో రాజా తన నిర్ణయం మార్చుకున్నారు. బీజేపీకి కేటాయించే స్థానాలపైన కొన్ని మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. తుది చర్చల తర్వాత బీజేపీ తమ జాబితా ప్రకటించే చాన్స్ ఉంది. దీంతో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలపైన టీడీపీలో ఇప్పుడు ఉత్కంఠ పెరుగుతోంది.

TAGS