Chandrababu : ‘‘ప్రజల భూమిపై జలగ పెత్తనమెంటో..’’ జగన్ పై విరుచుకుపడిన చంద్రబాబు
Chandrababu : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి. ఇప్పటికే అధినేతలు అందరూ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఒక్క క్షణం కూడా తీరికగా ఉండడం లేదు. అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయడానికి సతీమణులు సైతం రంగంలో దిగుతున్నారు. అలాగే అధినేతల తరుఫున కుటుంబ సభ్యులందరూ జనాల్లోకి వెళ్తున్నారు. ఇలా ఏపీలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ప్రజల్లో ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు..సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటని ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆయన ఫొటో ఎందుకని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తున్నారన్నారు. పింఛన్ రూ.2వేలకు పెంచింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో వచ్చాక జగన్ మ్యానిఫెస్టో విలవిలపోతోందన్నారు.
తాను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారని అయితే తన ప్రభుత్వంలో బడ్జెట్ లో 19 శాతం సంక్షేమానికే ఖర్చు చేశానన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 10 శాతం మాత్రమే ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి రాగానే జే బ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తామని, నాణ్యమైన లిక్కర్ ను తక్కువ ధరకే అందిస్తామన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్ ప్రజల భూములను తన దగ్గర పెట్టుకుంటారట అని చెప్పారు. ప్రజల భూమి ఇప్పుడు సైకో జగన్ గుప్పిట్లో ఉందని, భూమి ప్రజలది..పెత్తనం జలగది అని విమర్శించారు.
సైకో అందరి మెడలకు ఉరితాడు వేశారని, జగన్ ఎప్పుడు లాగితే అప్పుడు మీ ప్రాణం పోతుందని ప్రజలకు అవగాహన పరిచారు. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత తనదని అన్నారు. కాగా, చంద్రబాబు ప్రసంగాలకు జనం నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెప్పవచ్చు. కూటమి నేతల ప్రచారంతో జగన్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ అరాచక పాలనకు తెరపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.