JAISW News Telugu

Nandamuri Suhasini : ఎన్టీఆర్ అక్క నందమూరి సుహాసికి చంద్రబాబు కీలకపదవి ?

Nandamuri Suhasini

Nandamuri Suhasini

Nandamuri Suhasini : గత ఐదేళ్లలో దుర్గతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు, ప్రజా ప్రతినిధుల ఎంపికలో సరికొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.  టీడీపీకి రాజ్యసభలో ప్రస్తుతం ప్రాతినిధ్యం లేదు. తాజాగా వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలు టీడీపీకి దక్కటం లాంఛనంగా కనిపిస్తోంది. ఈ స్థానాల్లో పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేయాలనేది ఇప్పటికే చంద్రబాబు  నిర్ణయించినట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ.. పార్టీకి దూరంగా ఉంటున్న హీరో ఎన్టీఆర్ కు చెక్ పెట్టేలా నిర్ణయం ఉండనుందని సమాచారం.

గత నాయకత్వంతో విసినిపోయి వైసీపీకి చెందిన రాజ్యసభ, శాసనమండలి సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో టీడీపీ ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వైసీపీ నుంచి ఇప్పటి వరకు మోపిదేవి వెంకటరమణ, మస్తాన రావు రాజీనామా చేశారు. మరో సభ్యుడు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా  ఉన్నారని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన కూడా రాజీనామా చేయటం ఖాయమని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మూడు లేదంటే రెండు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయం.

అయితే టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్న వారిలో పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. మాజీ ఎంపిలు కంభంపాటి రామ్మోహన్‌ రావు, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్ర, పనబాక లక్ష్మీ, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు టీడీ జనార్ధన్‌, వర్ల రామయ్యలు ఉన్నారు. అయితే చంద్రబాబు తాజాగా ఎన్టీఆర్ అక్క నందమూరి సుహాసినికి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి రాజ్యసభ సీటు ఇవ్వటం ద్వారా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత..తెలంగాణలో పార్టీ భవిష్యత్ కు మేలు చేస్తుందని భావిస్తున్నారు.

ఒక సీటు సుహాసినికి కేటాయిస్తే.. మరో సీటు గల్లా జయదేవ్, సానా సతీశ్, జనసేన నుంచి పవన్ అన్న నాగబాబు పేర్లు  పరిశీలనలో ఉన్నాయి. ఆలపాటి, పనబాకలకు కూటమి పొత్తులో భాగంగా సీట్లు కేటాయించలేదు. వర్ల రామయ్యకు చేతిదాక వచ్చిన ఎంపీ సీటును గతంలో కనకమేడలకు కేటాయించడంతో దక్కలేదు. దీంతో ఈసారైనా ఆయనుకు అవకాశం  వస్తుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. అదే సమయంలో సుహాసినికి రాజ్యసభ ఇవ్వటం ద్వారా.. పార్టీకి దూరంగా ఉంటున్న తారక్ కు చెక్ పెట్టేలా కొత్త వ్యూహం సిద్దమవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది.

ఎవ‌రీ సుహాసిని?
మాజీ మంత్రి, ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి హ‌రికృష్ణ పెద్ద కుమార్తెనే ఈ సుహాసిని. ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా వృత్తిని ప్రారంభించారు.. తొలినాళ్లలో సినిమాల‌కు కూడా పనిచేశారు. త‌ర్వాత‌.. కుటుంబానికే ప‌రిమిత‌మ‌య్యారు. 2018 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ కండువా క‌ప్పుకుని.. మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె త‌ర‌ఫున అప్పట్లో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ప్రచారం చేశారు. కానీ, ఆమె ఘోరంగా ఓడిపోయారు.

Exit mobile version