Chandrababu : ఏపీలో టీడీపీ కూటమి సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12న సీఎంగా పదవి ప్రమాణం చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. కీలక ఉన్నతాధికారుల నియామకాలపై కాబోయే సీఎం చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ రెడ్డి కొమ్ముకాసిన ప్రస్తుత కీలక అధికారులను సాగనంపడంతో పాటు కొత్త వారిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేదానిపై చర్చిస్తున్నారు. ఐదేండ్లు భ్రష్టుపట్టిపోయిన పాలనను సరిదిద్దేందుకు సమర్థులైన అధికారులను నియమించే దిశగా ఆయన ఆలోచిస్తున్నారు.
కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న జవహర్ రెడ్డిని తాము తప్పించకుండానే ఆయనే స్వయంగా వెళ్లిపోయేలా ఇప్పటికే చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న విజయానంద్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ శాఖల్లో పనిచేసిన ఆయనకు అనుభవం, విధేయత కలిసివస్తాయని అంటున్నారు.
ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త సీఎస్ గా విజయానంద్ ను నియమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. అలాగే ఏపీ ట్రాన్స్ కో, ఏపీ జెన్ కో సీఎండీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఎనర్జీ, ఐటీ మంత్రిత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా పనిచేశారు.
మరో కీలకమైన పోస్టు ఇంటెలిజెన్స్ చీఫ్ గా మరో సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వేస్ డీజీపీగా ఉంటూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఆయన పిలిపించి ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి కట్టబెడుతారనే ప్రచారం జరుగుతోంది.