Chandrababu – Revanth : చంద్రబాబు నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే జెట్ స్పీడుతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు సంబంధించి ముందుగా పింఛన్ పెంపు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్స్‌పై సంతకాలు చేశారు. దీంతో ఆయా వర్గాల వారు చాలా ఆనందపడుతున్నారు. తిరుమలతో ఈవో బదిలీతో మొదలుపెట్టి… జగన్మోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలన్నిటికీ కొమ్ముకాసిన సీఎస్ జవహర్ రెడ్డితో సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరినీ పక్కన పెట్టేశారు. మూడు రాజాధానుల విషయం పక్కన పెట్టి అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. దీంతో పాటు అక్కడ విధించిన ఆంక్షలు, బారికేడ్లు అన్నింటినీ తొలగించారు. బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.
రాష్ట్ర ప్రజలను పీడించి వసూలు చేస్తున్న చెత్త పన్నును రద్దు చేశారు. ఇవన్నీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లో చేసినవే. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయంతో ఆనవాయితీ ప్రకారం ఒక రోజు ముందుగా మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు. కనుక తొలి మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌పై చర్చించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై చర్చించి మరికొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది వరకు కేసీఆర్ పాలనలో భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తున్నప్పుడు ఆంధ్రా ప్రజలందరు కూడా జగన్ పాలనని కేసీఆర్ పాలనతో పోల్చి చూసుకునే వారు.
అదేవిధంగా తమ పాలన ఎంతగొప్పగా ఉందో చెప్పుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ఏపీలోని రోడ్లు, విద్యుత్ కోతలు, ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించలేకపోవడం వంటివి సాకుగా చూపిస్తుండేవారు. ఇప్పుడు చంద్రబాబు సిఎంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో ఇప్పుడు తెలంగాణ ప్రజలు తమ సీఎం రేవంత్ రెడ్డిని ఆయనతో పోల్చి చూసుకోకుండా ఉండరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడి ప్రజాకూటమిలా భారీ మెజార్టీ లేదు. బొటాబోటి మెజార్టీ ఉన్నందున చాలా ఆచితూచి ముందుకు సాగాల్సి వస్తోంది. అదీ కాక రేవంత్ రెడ్డి సిఎం అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానాన్ని అడగకుండా ఏ పని చేయలేరు. అసెంబ్లీ ఎన్నికలలో సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చేసినప్పటికీ, అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ అమలుచేసేందుకు ప్రభుత్వానికి ఖజానాలో నిల్వలు లేకపోవడంతో వాటి అమలులో జాప్యం అవుతోంది. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ అంటూ ప్రజల దృష్టిని మళ్ళించేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కానీ ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ ఆర్ధిక పరిస్థితి చాలా దెబ్బతింది. కానీ చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రిగా పరిపాలనలో అపార అనుభవం ఉంది. అంతే కాకుండా శాఖలు, వాటి అధికారుల పనితీరుపై పూర్తి అవగాహన ఉంది. ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. పైగా కేంద్రంలో భాగస్వామిగా కూడా ఉన్నారు. కనుక ఏపీని అభివృద్ధిపథంలో నడేపేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక రేవంత్ రెడ్డి కూడా ఆయనతో పోటీ పడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.