Chandrababu : ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి జనసేన పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ కలిసి చర్చలు జరిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఉమ్మడిగా మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో వేదికపై పురందేశ్వరీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆసీనులయ్యారు.
చంద్రబాబుకు మధ్యలో ఎల్లో కలర్ టవల్ ఉన్న సీట్ ప్రత్యేకంగా వేశారు. ముందుగా పవన్ కల్యాణ్ తో ఆలింగనం చేసుకున్న తర్వాత సీట్లో కూర్చున్న చంద్రబాబు తన గన్ మెన్ కు చెప్పి ప్రత్యేక కుర్చీ అవసరం లేదని.. పవన్ కల్యాణ్, పురందేశ్వరీ కూర్చున్న లాంటి కుర్చీ తీసుకురమ్మని చెప్పాడు. అనంతరం వారు తెచ్చిన సేమ్ కుర్చీలోనే కూర్చొని సమావేశంలో చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు చేయాల్సిన పనులు, గాడిన పెట్టాల్సిన సంక్షేమం, అభివృద్ధి గురించి చర్చించారు.
ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎం పదవి పవన్ కల్యాణ్ కు దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేనకు రెండు మంత్రి పదవులతో పాటు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. బీజేపీకి కూడా రెండు మంత్రి పదవులు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు దీనిపై నోరు విప్పడం లేదు. స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసి చెప్పేంతా వరకు ఎవరికీ కూడా మంత్రి పదవి కన్ఫమ్ కాలేదని తెలుస్తోంది.
మంత్రి పదవుల కేటాయింపు విషయంలో ఆచి తూచి స్పందించాల్సిన అవసరముందని కూటమి నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన వారు ఒక వైపు.. జగన్ సేనని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన వారు మరో వైపు ఇలా అనేక మంది మంత్రి పదవుల కోసం పోరాడుతున్నారు. మరి మంత్రి పదవి దక్కనున్న అదృష్టవంతులు ఎవరో రేపటితో తేలిపోనుంది.