Chandrababu : టీడీపీ ఎంపీలపై ‘పెద్ద బాధ్యత’ పెట్టిన చంద్రబాబు!

Chandrababu

Chandrababu

Chandrababu : జగన్ రెడ్డి పాలనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గాడినపెడుతున్నారు. పాలన మొదలైన నెల రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. వీటిన్నంటి కంటే ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్ కు ఎంతో కీలకమైన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇలా ఎన్నో పెద్ద పనులు కూటమి ప్రభుత్వం ముందున్నాయి. దీనికి కేంద్ర సహకారం తప్పనిసరి. అందుకే చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రంలో ఏపీకి చెందిన పనులు వడివడిగా చక్కబెట్టుకునేందుకు టీడీపీ ఎంపీలకు ఢిల్లీలో ఏపీకి రాయబారులుగా వ్యవహరించే బాధ్యతలను అప్పజెప్పారు. ఒక్కో ఎంపీకి ఒక్కో ప్రధాన మంత్రిత్వ శాఖను కేటాయించి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, పథకాలు, నిధులు మంజూరుకు సంబంధించి కీలక బాధ్యతలను అప్పగించే దిశగా కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 22న కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులతో ప్రతి ఎంపీని అనుసంధానం చేయడం, ఢిల్లీకి, రాష్ట్రానికి మధ్య సమాచార లోపం లేకుండా, వేగంగా ఫైళ్ల క్లియరెన్స్ చేయించడం ఎంపీల ప్రధాన బాధ్యతలుగా భావిస్తున్నారు. టీడీపీ పార్లీమెంటరీ పార్టీ నాయకుడిగా వివిధ కేంద్ర మంత్రుల వద్దకు పార్టీ ఎంపీలను తీసుకు వెళ్లి కీలక సమస్యలపై వినతి పత్రాలు సమర్పించి, వాటిని పరిష్కరించే బాధ్యతలను లావు శ్రీకృష్ణదేవరాయలుకు అప్పగించారు. కేంద్ర కేబినెట్ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్నందున ఆయన తోటి మంత్రులు, అధికారులతో సంబంధాలు పెంచుకుని రాష్ట్రానికి చెందిన ప్రధాన సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది.

టీడీపీ లోక్‌సభ సభ్యుల్లో మొత్తం 16 మంది అనుభవజ్ఞులు, విద్యాధికులు, వ్యాపారవేత్తలు ఉండడంతో వారంతా చంద్రబాబుకు కొండంత అండగా మారనున్నారు. త్వరలో పార్లమెంటులో వివిధ శాఖలకు చెందిన కమిటీల్లో టీడీపీ ఎంపీలకు సభ్యత్వం లభిస్తుందని, అప్పుడు ఆయా శాఖల మంత్రులు, అధికారులతో వారు సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు తోడ్పడే అవకాశం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు  తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంపీలను క్రియాశీలకంగా ఉపయోగించుకోవడం హర్షణీయమన్నారు.

TAGS