Amaravati Project : ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కోసం గతంలో పనులు అప్పగించిన కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఉండవల్లి నివాసంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయినట్లు తెలిసింది. అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడంతో గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన పనులను పునఃప్రారంభించే ప్రక్రియను సీఎం ప్రారంభించారు.
2014 నుంచి 2019 వరకు రాజధాని ప్రాంతంలోని పలు ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచినా గత ప్రభుత్వం పనులు నిలిపివేసింది. పనుల టెండర్ తేదీలు ముగియడంతో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి ముందుకు వెళ్లడంపై దృష్టి సారించింది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు జూన్ 20న అమరావతిలో పర్యటించి ఐఏఎస్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల క్వార్టర్లు సహా పలు భవనాలను పరిశీలించారు. ప్రాజెక్టుల దయనీయ స్థితికి గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తేల్చారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరిందని, దాని ఆధారంగా అమరావతిలో పనులు కొనసాగించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్డీయేకు లభించిన అఖండ ప్రజాతీర్పును పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు తన సహచరులకు సూచించారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మంత్రులు బృందాలుగా ఏర్పడి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సీఎం సూచించినట్లు సమాచారం. 100 రోజుల ప్రణాళికపై దృష్టి సారించాలని, ఆయా శాఖలపై పట్టు పెంచుకోవాని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. కేబినెట్ లో మీకు అవకాశం ఇచ్చినందున విధులు నిర్వర్తించేటప్పుడు మీ జిల్లాల్లోని సీనియర్ల సలహాలు తీసుకోవాలని చంద్రబాబు మంత్రులకు సూచించినట్లు తెలిసింది.
అసెంబ్లీ సమావేశాలు
జూలై మూడో వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో పాటు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును కూడా ఆమోదించనుంది.