Chandrababu : ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేశారు. ఇక మిగిలిన అభ్యర్థులను కూడా త్వరగా ప్రకటించేసి..ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కూటమి జగన్ ఓటమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. తమతో పాటు బీజేపీ కూడా కలిసిరావాలని ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కోరుకుంటున్నారు. అయితే బీజేపీ నుంచి పొత్తుపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. ఈ టైంలో చంద్రబాబు కీలక అడుగు వేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఏపీలో జగన్ ఓడించాలంటే తమతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ సైతం తమతో బీజేపీ కలిసివస్తుందని ఆశిస్తున్నట్టు పలుమార్లు చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. తాజగా చంద్రబాబు, పవన్ భేటీలోనూ బీజేపీ పొత్తు అంశం చర్చకు వచ్చింది.
ఈ నెలాఖరు వరకు వేచి చూసి బీజేపీ నుంచి స్పందన రాకపోతే ఏపీలో సీపీఐతో పొత్తుతో ముందుకు వెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏపీలో జనసేనతోనే పొత్తు పెట్టుకుంటామని పదే పదే చెబుతున్న బీజేపీ నేతలు.. కూటమిగా ఉన్న టీడీపీతో కలిసే అవకాశంపై మాత్రం ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. ఏపీలోని నేతల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈనెల 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. దీని ద్వారా బీజేపీ ముఖ్యులకు దగ్గరయ్యేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తు పై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పొత్తు కారణంగా కొన్ని వర్గాల ఓట్లు కోల్పోయే అవకాశం ఉందని కొందరు నేతలు చెబుతున్నారు.
అయినా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చివరి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత ఏపీలో పొత్తులపై బీజేపీ తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. బీజేపీ కలిసి రాకపోతే పవన్ నిర్ణయం కీలకం కాబోతోంది. మరి ఈ పొత్తుల వ్యవహారం ఎలా సెట్ రైట్ అవుతుందో రామాలయ ప్రారంభం తర్వాతే తేలనుంది.