JAISW News Telugu

Fiber Net Case:సుప్రీంలో ఫైబ‌ర్ కేసు విచార‌ణ వాయిదా

Fiber Net Case:ఫైబ‌ర్ నెట్ కేసు ఏపీ రాజ‌కీయాల‌ని ఓ కుదుపు కుదిపేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు సుప్రీంలో న‌డుస్తోంది. ఫైబ‌ర్ నెట్ కేసు విచార‌ణ‌ను సుప్రీం కోర్టు జ‌న‌వ‌రి 17కు వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో ముంద‌స్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సుప్రీంలో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. స్కిల్ కేసులో 17ఏపై కేసు పెండింగ్‌లో ఉన్న నేప‌థ్యంలో విచార‌ణ ప‌లు మార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఈ రోజు జ‌స్టీస్ అనిరుద్ద బోస్‌, జ‌స్టీస్ బేలా ఎం.త్రివేది ధ‌ర్మాస‌నం ముందుకు ఫైబ‌ర్ నెట్ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది.

స్కిల్ కేసులో 17ఏపై తీర్పు వెలువ‌రించాల్సి ఉన్నందున ఫైబ‌ర్ నెట్ కేసుని జ‌న‌వ‌రి 17కు వాయిదా వేస్తున్న‌ట్లుగా ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. అంతవ‌ర‌కూ చంద్ర‌బాబుపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరాద‌ని ఆదేశించింది. ఫైబ‌ర్ నెట్ కేసు గురించి కూడా చంద్ర‌బాబు మాట్లాడ‌కుండా నిలువ‌రించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం త‌రుపు న్యాయ‌వాది రంజిత్ కుమార్ విజ్ఞ‌ప్తి చేశారు. చంద్ర‌బాబు మాట్లాడ‌టం లేద‌ని ఆయ‌న త‌రుపు సీనియ‌ర్ లాయ‌ర్ సిద్ధార్థ‌ లూథ్రా స్ప‌ష్టం చేశారు.

ఏఏజీ, డీజీపీలు మాత్ర‌మే ఢిల్లీ, హైద‌రాబాద్‌ల‌లో విలేక‌రుల స‌మావేశం పెట్టి కేసు గురించి మాట్లాడుతున్నార‌ని సిద్ధార్థ‌ లూథ్రా తెలిపారు. కేసు గురించి ఎవ‌రేం మాట్లాడారో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఇరువురి త‌రుపు న్యాయ‌వాదుల‌ని ఆదేశిస్తూ..ఇరు వ‌ర్గాలు సంయ‌మ‌నం పాటించాలని సుప్రీం ధ‌ర్మాస‌నం సూచించింది.

Exit mobile version