Chandrababu Birthday Celebrations in Britain : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 74వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇలా పలు దేశాల్లోని తెలుగు వారు చంద్రబాబు బర్త్ డే వేడుకలను వైభవంగా నిర్వహించారు. పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడికి పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా 74 ఏండ్ల వయస్సులోనూ చంద్రబాబు ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అరాచక వైసీపీ పాలనకు చరమ గీతం పాడి టీడీపీ కూటమికి అధికారంలోకి తెప్పించడమే ధ్యేయంగా ఆయన ఆహర్నిషలు కృషి చేస్తున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన విధ్వంసాన్ని రూపుమాపి రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలిపేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. ఈక్రమంలో చంద్రబాబు పుట్టిన రోజు రావడంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామగ్రామన వేడుకలు నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బ్రిటన్ లో కూడా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్ ఆర్ ఐ తెలుగు దేశం పార్టీ యూరప్ టీం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది. బ్రిటన్ లోని బర్మింగ్ టన్, కావెంట్రీ నగరాల్లోని తెలుగు వారు ఘనంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాతగా అభివర్ణించారు. నేటి చంద్రబాబు ఆలోచనలే రేపటి భారత దేశ ఆచరణలని, ఆయన గొప్ప విజనరీ అని కొనియాడారు. తమలాంటి ఎంతో మందిని తమ కాళ్ల మీద తాము నిలబడేలా ఐటీని ప్రోత్సహించి తమ ఉన్నతికి కారణమయ్యారని ప్రశంసించారు.
ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అభివృద్ధిలో కీలకంగా మారిన హైటెక్ సిటీ నిర్మాణం వెనక చంద్రబాబు కృషి ఎంతో ఉందన్నారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థకు రెండో కేంద్రంగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇక నవ్యాంధ్ర, అమరావతిని నిర్మించేది చంద్రబాబు మాత్రమే అన్నారు. ఆయన హయాంలోనే పోలవరం పూర్తవుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు.