Chandrababu : చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా
Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణను సుప్రీం కోర్టు పది వారాలకు వాయిదా వేసింది. 17ఏ అంశంపై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెలువడ్డాక దీన్ని పరిశీలిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిత్తల్ తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఏపీ సీఐడీ తరపున సీనిమర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదిస్తూ 17ఏ అంశాన్ని త్రిసభక్య ధర్మాసనానికి ప్రతిపాదించిన కేసు పెండింగ్ లో ఉందని, దానిపై నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
జస్టిస్ త్రివేది స్పందిస్తూ ఆ అంశం తేలాక ఈ కేసును విచారణకు స్వీకరిస్తామని చెప్పొచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కల్పించుకొని ఆ విషయాన్ని కోర్టుకే వదిలిపెడుతున్నామని, ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలైందని చెప్పారు. సెక్షన్-17ఏ కింద రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోనందున కోర్టు ఆ చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ త్రివేది కేసును పది వారాలకు వాయిదా వేస్తున్నామని చెప్పి విచారణ ముగించారు. దీనిపై తక్షణం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదని, వేసవి సెలవుల తర్వాత వింటామని పేర్కొన్నారు.