Prashant Kishore : రాజకీయ వ్యూహకర్తగా విజయవంతమైన ట్రాక్ రికార్డు ప్రశాంత్ కిషోర్ సొంతం. మొన్నటి దాక ఆయన హవా నడిచిందనే చెప్పాలి. గతంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ, డీఎంకే వంటి ఎన్నో పార్టీలకు ఆయన వ్యూహకర్తగా పనిచేశారు. వాటిని అధికారంలోకి తెచ్చారు. ‘‘మేరే పాస్ పీకే హై..’’అని విజయం తమ వైపే అని అప్పట్లో రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు సవాల్ విసిరేవి. సోషల్ మీడియాను బలంగా వాడుకోవడం, సమయానికి తగు పాచికలు వేయడం, పార్టీ అధినేతల ఎలివేషన్స్…ఇలా ఎన్నెన్నో ఆయన వ్యూహాల్లో ఉండేవి. పీకే మార్క్ రాజకీయాలు గతంలో బాగానే వర్క్ అవుట్ అయ్యాయి.
ఇక ఈ మధ్య ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు పార్టీలకు ఆయన శిష్యులే వ్యూహకర్తలుగా పనిచేస్తున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు దాకా ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్ కు పనిచేశారు. కానీ మధ్యలోనే డ్రాప్ అయ్యారు. దానికి కారణం ఏంటో కూడా తెలియదు. అపర చాణక్యుడైన కేసీఆర్ కూడా పీకే చెప్పే వ్యూహాలకు ఒకే అన్నాడు. కానీ ఎక్కడ చెడిందో గాని పీకే అర్థంతరంగా బిహార్ కు వెళ్లిపోయి తానే పార్టీ పెట్టుకోవడానికి సిద్ధమైపోయాడు. కానీ అది కూడా వర్క్ వుట్ కాలేదు.
ఇక మొన్న డిసెంబర్ లో అనూహ్యంగా చంద్రబాబుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ విజయవాడుకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఇద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడి ఇంటికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో వీరేం మాట్లాడుకున్నారు..టీడీపీకి పీకే వ్యూహకర్తగా పనిచేయబోతున్నారా? అంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికీ రెండు నెలలు అవుతున్నా దీనిపై ఎలాంటి వార్తలు మళ్లీ రాలేదు. పీకే వ్యూహకర్తగా పనిచేస్తున్నట్టు కూడా ఎలాంటి సమాచారం లేదు.
తాజాగా ఈ విషయాలపై ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ స్పందించారు.. తాను చంద్రబాబు కలిసిన మాట నిజమేనన్నారు. తాను చంద్రబాబుతో ఓ కీలక భేటీలో పాల్గొన్నానని చెప్పారు. ఆ సమావేశంలో చంద్రబాబు తనను వ్యూహకర్తగా పనిచేయమని కోరారు. దానికి తాను చేయనని చెప్పానని తెలిపారు. ప్రస్తుతం తాను ఏపీ అధికార పార్టీ వైసీపీకిగాని, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేయడం లేదని స్పష్టం చేశారు.