JAISW News Telugu

Chandrababu : ఎన్డీఏలో కింగ్ మేకర్ గా చంద్రబాబు.. ఏపీకి మంచి రోజులొస్తున్నయ్

Chandrababu

Chandrababu

Chandrababu : మరోసారి ఎన్డీఏలో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారు. ఏపీ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయదుందుభి మోగించడంతో చంద్రబాబు మరోసారి కింగ్ మేకర్ కానున్నారు. టీడీపీ చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో విజయభేరి మోగించి 16 ఎంపీ సీట్లు గెలుచుకుంది. దీంతో త్వరలో కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారింది. దీంతో చంద్రబాబు డిమాండ్లకు బీజేపీ పెద్దలు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలో టీడీపీ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వంలో తమకు 3 నుంచి 5 కీల మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నట్లు టాక్ నడుస్తోంది.

గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో ఎన్డీఏ కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు హవా నడిచిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలు ఇచ్చిన బంపర్ మెజార్టీతో చంద్రబాబు మళ్లీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు. దీని కోసం చంద్రబాబు సమయాత్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ నివాసంలో జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరవుతారని కూటమి వర్గాలు చెబుతున్నాయి.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి టీడీపీ సీట్లు అత్యంత అవసరం కావడంతో చంద్రబాబు కీలక మంత్రి పదవులను కోరే అవకాశం దక్కింది. అలాగే రాష్ట్ర విభజన అంశాలు, నిధులు, ప్రాజెక్టులు.. తదితర ప్రయోజనాలను రాబట్టుకునే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారట. ఇందులో భాగంగా కీలక మంత్రి పదవులను డిమాండ్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఏ శాఖలను అడుగుతున్నారు? కేబినెట్ పదవులు ఎన్ని? సహాయ మంత్రి పదవులు ఎన్ని అడుగుతున్నారు? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

కాగల కార్యం గంధర్వలు తీర్చినట్టుగా జగన్ తన మార్క్ పాలనతో ప్రజలతో ఛీ కొట్టించుకోవడం.. టీడీపీ కూటమికి భారీ విజయం కట్టబెట్టడంతో చంద్రబాబు మరోసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు. ఈనేపథ్యంలో బీజేపీకి సీట్లు తగ్గడం కూడా టీడీపీ కలిసిరాబోతోంది. రాష్ట్ర ప్రయోజనాలను మిన్నగా సాధించుకోవడానికి మార్గం ఏర్పడింది. ఇక ఏపీకి మంచి రోజులు వచ్చినట్టేనని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోవడం, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు దీటుగా అమరావతిని డెవలప్ చేసుకోవడం.. వంటి ఎన్నో రాష్ట్ర భవిష్యత్ తో ముడిపడి ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసుకునే అవకాశం దక్కింది.

Exit mobile version