Chandrababu : ఎన్డీఏ జాతీయ కన్వీనర్ గా చంద్రబాబు.. మళ్లీ చక్రం తిప్పే రోజులొచ్చేశాయ్..

Chandrababu

Chandrababu

Chandrababu : ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి దూకుడుకు వైసీపీ పత్తా లేకుండా పోయింది. చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో టీడీపీ విజయం దక్కించుకోవడంపై శ్రేణుల ఉత్సాహం అంబరాన్నంటుతోంది. జిల్లాలకు జిల్లాలను క్లీన్ స్వీప్ చేయడాన్ని చూస్తే కూటమికి ప్రజల నుంచి ఎంత భారీ స్థాయిలో మద్దతు లభించిందో అర్థమవుతోంది. వైసీపీ ఐదేండ్ల పాలనలో ప్రజలు అనుభవించిన నరకయాతనకు రివేంజ్ గా గంపగుత్తగా కూటమికి ఓట్లు పడడం అద్భుతమైన రాజకీయ పరిణామం అని చెప్పవచ్చు.

టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 160 సీట్లకు పైగా గెలవడమే కాదు..ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు జాతీయ స్థాయిలో కింగ్ మేకర్ గా నిలువనున్నారు. అసలు ఇలాంటి అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు. చంద్రబాబు మళ్లీ జాతీయ స్థాయిలో కీలక నేతగా చక్రం తిప్పనుండడంతో టీడీపీ క్యాడర్ సంబరాల్లో మునిగితేలుతోంది.  టీడీపీ సాధించిన తిరుగులేని విజయం జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీడీపీ మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ, అటు ఇండియా కూటమి చంద్రబాబు మద్దతును సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

తమకు మద్దతిస్తే చంద్రబాబుకు కీలకమైన పదవులను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాయి ఆ రెండు కూటములు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి..ఈ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకున్న బీజేపీకే చంద్రబాబు మద్దతు ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబును నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు డిమాండ్లకు  బీజేపీ తలొగ్గక తప్పని పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదా  ఇవ్వడం, పోలవరాన్ని పూర్తి చేయడం, రాజధానికి సాయం చేయడం వంటి రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాలను ఎన్డీఏ ద్వారా సాధించుకునే అవకాశం ఏర్పడింది. ఇదే జరిగితే ఏపీ చరిత్రను తిరగరాసిన వ్యక్తిగా చంద్రబాబు పేరు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖితమవుతుంది. అలాగే నాలుగో సారి ఏపీ సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిపోనున్నారు.

TAGS