Nara Lokesh : తొలిసారి గెలిచిన లోకేశ్ కు తండ్రి, మామ ఆశీర్వాదం
Nara Lokesh : తెలుగు తమ్ముళ్ల ఆకాంక్ష నెరవేరింది. తమ ప్రియతమ యువ నాయకుడు లోకేశ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని వారు కలకాలం గుర్తుంచుకుంటారు. 2019లో మంగళగిరిలో ఓడిన లోకేశ్..తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి తన సత్తా చాటారు. లోకేశ్ ఓడిన తర్వాత ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేసింది. దాన్ని కసిగా తీసుకుని తనకు తాను ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు లోకేశ్. యువగళం పేరుతో లోకేశ్ చేసిన పాదయాత్రలతో టీడీపీకి ఊపు వచ్చిందనడంలో సందేహం లేదు. ఏ మంగళగిరిలో ఓడారో..తాజా ఎన్నికల్లో అదే మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో గెలిచారు.
ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నుంచి లోకేశ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. అలాగే రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అప్పటికే సభకు చేరుకున్న పవన్.. చంద్రబాబును కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం గెలిచింది.. గౌరవ సభకు స్వాగతం’ అంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం ప్రొటెం స్వీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు. అనంతరం సభ్యులకు ప్రొటెం స్పీకర్ సభా నియమాలు వివరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ నియమాలు పాటిస్తానని మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు సభ్యులందరూ దైవసాక్షిగానే ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అభ్యర్థన మేరకు వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేశారు.
తొలుత చంద్రబాబునాయుడు తర్వాత జనసేన చీఫ్, డిప్యూట్ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా అనిత, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, కందుల దుర్గేశ్, ఎన్ఎండీ ఫరూఖ్, బీసీ జనార్దన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోకేశ్ తండ్రి చంద్రబాబు వద్దకు, మామ బాలకృష్ణ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ రెండు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన లోకేశ్..తండ్రికి తగ్గ తనయుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలని టీడీపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ సోషల్ మీడియాలో లోకేశ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి