Chandrababu-Pawan : ఏపీలో ఎటూ చూసినా ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎన్నికలకు మరో నెలన్నరే ఉండడంతో నేతలంతా బిజీబిజీ అయిపోయారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకెళ్తున్నాయి. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించి రెండో దఫా అధికారాన్ని చేపట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇదే టైంలో జగన్ ను గద్దె దించాలని అటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ జనసేన కూటమి, ఉమ్మడిగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇక నేడు టీడీపీ, జనసేన భారీ బహిరంగ సభ తాడేపల్లిగూడెం, పత్తిపాడులలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నుంచి ముఖ్యనేతలు పాల్గొంటారు. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని టీడీపీ, జనసేన భావిస్తోంది. లక్షలాది కార్యకర్తలు తరలివచ్చేలా ప్లాన్ చేశారు.
తెలుగు జన విజయకేతనం జెండాగా ఈ సభకు నామకరణం కూడా చేశారు. ఈ సభావేదికగా ఏపీ రాష్ట్ర సంక్షేమ, అభివృద్ధి ఉమ్మడి అజెండాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించనున్నారు. సీఎం జగన్ తమపై చేస్తున్న విమర్శలకు ఈ సభ ద్వారా దీటైన సమాధానం ఇవ్వనున్నారు.
టీడీపీ, జనసేన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగు జన విజయకేతనం జెండా బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు రాకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందని, బస్సులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని, అయినా ఆ ఇబ్బందులను అధిగమించి భారీ సంఖ్యలో కార్లు, టూ వీలర్ల ద్వారా కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని టీడీపీ, జనసేన పార్టీ నేతలు కోరుతున్నారు.