Chandrababu and Pawan : ఏపీలో ఎక్కడా చూసినా సార్వత్రిక ఎన్నికల కోలాహలమే కనపడుతోంది. అభ్యర్థుల ఎంపికలో, ప్రచారంలో అనుసరించాల్సిన విధానం, ప్రజలను ఆకట్టుకునేలా మ్యానిఫెస్టో.. ఇలా అన్ని పార్టీలు పనుల్లో తలమునకలయ్యాయి. ఈక్రమంలో ఇక్కడి ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు రాష్ట్రానికి వచ్చారు. వారిలో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ విజయవాడకు చేరుకున్నారు.
టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ..వారిని కలిశారు. ఏపీలో ఓటర్ల జాబితాలో జరుగుతున్న మార్పులు, చేర్పులపై ఫిర్యాదు చేశారు. అధికారం వైసీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమైన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు.. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై అనేక కేసులను పెడుతున్నారని మండిపడ్డారు.
జగన్ ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో వేలాది ఓట్లను తొలగించారని విమర్శించారు. ఆయా విషయాలన్నింటినీ కేంద్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
టీడీపీ-జనసేన నేతలపై 6 వేలకు పైగా కేసులు నమోదు చేశారని, ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని, అలాంటి వాతావరణంలో ఏపీలో కూడా ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు, ఇతర భద్రతా బలగాలను ఏపీకి పంపించాలని సూచించారు.
ఒక్క దొంగ ఓటు ఉన్న కూడా తాము ఈసీ దృష్టికి తీసుకెళ్తామని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడే వారిపై అవసరమైతే కోర్టుకు వెళ్లి శిక్షపడేలా చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాల్లో నివసించే వారికి ఓటు హక్కు నిరాకరించడం సరికాదన్నారు. రెండు చోట్లా ఓటు ఉండడం నేరమే. అయినప్పటికీ.. వేరే రాష్ట్రాల్లో ఓటు హక్కు లేనివారికి ఏపీలో ఓటు హక్కు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు.