Chandrababu : కేబినెట్ కూర్పుపై బాబు కసరత్తు
Chandrababu : మరో నాలుగైదు రోజుల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ కూర్పు పై కూటమిలోని పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పలువురు సీనియర్లు మంత్రి వర్గంలో చోటు కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జనసేన, బీజేపీలకు కూడా మంత్రి వర్గంలో పదవులు దక్కనున్నాయి. అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకొని పదవులు పంపకం చేపట్టనున్నారు.
మంత్రి వర్గంలో పాతిక మంది
కొత్త ప్రభుత్వంలో మొత్తం 25 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కాపు, బీసీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. సీనియర్లు – యువతకు ఈసారి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. అయితే టీడీపీ నుంచి సీనియర్ల లిస్టు పెద్దగానే ఉంది. ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీని అట్టిపెట్టుకొని కేడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం పని చేశారు. ఏ వర్గానికి ఇబ్బంది కలుగకుండా అందరినీ సంతృప్తి పరిచేలా మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మంత్రి పదవులు దక్కని వారికి నామినేటెడ్ లేదా ఇతర కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించి బుజ్జగించాలని బాబు భావిస్తున్నారు.
మిత్రపక్షాలకు అవకాశం
మంత్రి వర్గంలో జనసేన నుంచి ముగ్గురికి అవకాశం ఉంటుందనే ప్రచారం సైతం సాగుతున్నది. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేబినెట్ లోకి వస్తారా లేదో ఇప్పటి వరకైతే స్పష్టత లేదు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి మంత్రి వర్గంలో అవకాశం దక్కవచ్చు. బీజేపీ నుంచి ఇద్దరికి బెర్త్ లు ఖాయమని తెలుస్తున్నది. .సీనియార్టీతో పాటు యువతను భాగస్వామ్యం చేస్తూ .మూడు ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూనే.. సామాజిక సమీకరణాలను సైతం పరిగణనలోకి తీసుకొని చంద్రబాబు తన మంత్రివర్గాన్ని ఫైనల్ చేయనున్నారు. అయితే టీడీపీ సీనియర్లలో ఎవరికి అవకాశం వస్తుందనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తి కర చర్చ మొదలైంది.