Chandrababu Strategy : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ ప్రచారం జరిగినా తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ, చేయాల్సిన దాని గురించి చెప్పేవారు. దీని వల్ల వినే వారు చెప్పిందే చెప్తున్నాడంటూ మొత్తుకుంటున్నారు. దీంతో తన ఎన్నికల ప్రసంగశైలిని చంద్రబాబు మార్చేశారు. ఏ జిల్లా, ఏ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే అక్కడ సమస్యల గురించి సమాచారం తెప్పించుకుంటున్నారు.
ప్రసంగంలో ప్రస్తావిస్తున్నారు. ఇలా ప్రస్తావించడం వల్ల ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో ప్రచారం మొత్తం ఇదే పద్ధతి పాటిస్తున్నారు. రీసెంట్ గా పర్యటించిన ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇదే పద్ధతి అనుసరించారు. పవన్ కల్యాణ్ తో కలిసి చేసిన ప్రచారంలో ఆయన ఇమేజ్ పెంచేలా మాట్లాడారు. దీనివల్ల జనసైనికుల్లో జోష్ కనిపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విషయంలోనూ ఇదే విధానం అనుసరిస్తున్నారు. ఆమెతోపాటు ఆ పార్టీ అగ్రనేతలను పదే పదే ప్రస్తావిస్తూ ఆ పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూరగొంటున్నారు.
మోడీ నేతృత్వంలో ఎన్డీయేకు మద్దతిస్తూ ఏపీని డెవలప్ చేసుకుందామని పిలుపునిస్తున్నారు. ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ టీడీపీ+బీజేపీ+జనసేన వేర్వేరు కాదని, కూటమిలోని పార్టీలన్నీ ఒకటేనంటూ చెప్తున్నారు. ఆ 2 పార్టీల అభ్యర్థులను పక్కన పెట్టుకొని వారిని గెలిపించాలని ప్రజలకు విన్నవిస్తున్నారు. ఎక్కడకి వెళ్లినా టీడీపీని ప్రత్యేకంగా ప్రస్తావించకుండా 3 పార్టీలు ఒకటే అనే విషయాన్ని చెబుతున్నారు. తరుచుగా తన ప్రసంగంలో చేసింది చెప్పడం కన్నా ప్రభుత్వ వైఫల్యాలను పదే పదే ప్రస్తావించడం ద్వారా ప్రజలు దగ్గరవుతున్నారని, వారి ఆలోచనలకు, అభిప్రాయాలకు అనుగుణంగానే మాట్లాడటం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని గుర్తించిన బాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అంతే వ్యూహాత్మకంగా తన ప్రసంగాలను కూడా మలుచుకుంటున్నారు. అంతిమంగా ఆయనకు కావాల్సిన విజయం దక్కిందా..? లేదా..? అనేది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచిచూడక తప్పదు.