Chandra Babu:తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికార బీఆర్ ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ అత్యధిక స్థానాలని దక్కించుకుని అధికారారాన్ని హస్తగతం చేసుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం, అధికార పగ్గాలు చేపట్టడం తెలిసిందే. గురువారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనపకంచెని తొలగించి సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మొదలు పెట్టారు.
అంతే కాకుండా శుక్రవారం జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో రేవంత్ రెడ్డి ప్రజాదర్భార్‌ను నిర్వహించడం, దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడం తెలిసిందే. ఇదే దూకుడుతో విద్యుత్, ఆర్టీసీ శాఖలపై కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డి సీమీక్ష చేయబోతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో వెలవడిన ఎన్నికల ఫలితాలపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు తెలంగాణ ఫలితాలపై స్పందించారు. `అహకారంతో విర్రవీగితే ఏమవుతుందో తెలంగాణలో చూశాం. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా చూస్తాం. జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉంది. నన్ను జైల్లో పెట్టించిన భయం జగన్‌ను వెంటాడుతోంది. చేయని తప్పుకు నన్ను జైల్లో పెట్టారు` అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.