Chandipura : ‘చాందీపుర’ వైరస్.. నలుగురు చిన్నారులు మృతి
Chandipura : దేశంలో మరో వైరస్ కలకలం రేపుతోంది. ‘చాందీపుర’ అనే వైరస్ గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తుండడంతో ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్ లోని హిమ్మత్ నగర్ సివిల్ ఆసుపత్రిలో ‘చాందీపుర’ వైరస్ బారినపడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. అదే ఆస్పత్రిలో ‘చాందీపుర’ వైరస్ బారినపడి రాజస్థాన్ కు చెందిన ఇద్దరు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఈ ఆరుగురు చిన్నారుల బ్లడ్ శాంపిల్స్ ను పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి (ఎన్ఐవీ) పరీక్షల నిమిత్తం పంపించారు. వాటి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కరోనా వైరస్ మూలాలన ఎంత ప్రాణ నష్టం జరిగిందో అందరికీ తెలిసిందే. కరోనా వైరసస్ గురించి మరిచిపోతున్న సమయంలో ఈ ‘చాందీపుర’ వైరస్ భయం మొదలైంది.
ఈ వైరస్ ను మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోని ‘చాందీపుర’ అనే గ్రామంలో గుర్తించారు. అందువల్ల ఈ వైరస్ కు ‘చాందీపుర’ వైరస్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఇండియాలోని పలు ప్రాంతాల్లో, ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఈ వైరస్ కేసులు బయటపడ్డాయి. ఈ వైరస్ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. తీవ్ర జ్వరం, డయేరియా, మూర్ఛ రావడం, చురుకుదనం కోల్పోవడం జరుగుతుంది. ఈ వైరస్ ప్రభావం మరింత ముదిరితే కోమా, రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యాధి పెద్దవాళ్లకు కూడా సోకే అవకాశం ఉన్నప్పటికీ చిన్నారులే ఎక్కువగా మృత్యువాత పడిన పరిస్థితులున్నాయి. ఈ వైరస్ ఈగను పోలిన ఉండే శాండ్ ఫ్లై (గుడ్డీగ) అనే చిన్న కీటకం కుట్టడం వల్ల సోకుతుంది. క్రిమి కీటకాల బారిన పడకుండా జాగ్రత్త పడటం తప్ప ‘చాందీపుర’ వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేందుకు యాంటీ వైరల్ ట్రీట్ మెంట్ ఏదీ అందుబాటులో లేదు. ‘చాందీపుర’ వైరస్ సోకితే సరైన చికిత్స ఏదీ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.